Team India: ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ ఫెయిల్.. కానీ మ్యాచ్‌లో అలవోకగా గెలిచిన భారత్
India vs Prime Minister XI Match: ఆస్ట్రేలియాతో అడిలైడ్ డే/నైట్ టెస్టు ముంగిట కెప్టెన్ రోహిత్ శర్మ అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మ్యాచ్‌లో 11 బంతులాడిన హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులే చేసి వికెట్ చేజార్చుకున్నాడు. అయితే.. మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు జోరు కొనసాగుతోంది. ఇటీవల పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుని 295 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో ఆదివారం జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ప్రాక్టీస్‌గా ఈ వార్మప్ మ్యాచ్‌ను టీమిండియా ఆటగాళ్లు వినియోగించుకున్నారు. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు.
ఏడుగురు సింగిల్ డిజిట్‌కే ఔట్
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ప్లేయింగ్ ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ శామ్ కోనస్టాస్ (107: 97 బంతుల్లో 14x4, 1x6) సెంచరీ నమోదు చేసినా.. భారత్ బౌలర్ల దెబ్బకి ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైపోయారు. అయితే.. శామ్‌తో కలిసి జాక్ క్లైటాన్ (40: 52 బంతుల్లో 6x4), హానో జాకబ్స్ (61: 60 బంతుల్లో 4x4, 2x6) నిలకడగా ఆడారు. దాంతో ఆస్ట్రేలియా 240 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టాడు.
హాఫ్ సెంచరీ బాదిన శుభమన్ గిల్
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభమన్ గిల్ (50 రిటైర్డ్ హర్ట్ : 62 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. నితీశ్ రెడ్డి (42), వాషింగ్టన్ సుందర్ (42), యశస్వి జైశ్వాల్ (45) దూకుడుగా ఆడారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం 11 బంతులాడి కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో అడిలైడ్ టెస్టులో హిట్ మ్యాన్ ఎలా ఆడతాడో? అనే సందేహం భారత్ అభిమానుల్లో మొదలైంది. భారత్ జట్టు 46 ఓవర్లలో 257/5తో ఇన్నింగ్స్‌ని విజయంగా ముగించింది.
విరాట్ కోహ్లీ ప్లేస్‌లో రోహిత్ శర్మ
వాస్తవానికి 241 పరుగుల వద్దే భారత్ జట్టు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచేసింది. కానీ.. వార్మప్ మ్యాచ్ కావడంతో.. ఇన్నింగ్స్‌ను అలానే కొనసాగించారు. ఈ వార్మప్ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉండిపోయాడు. దాంతో విరాట్ కోహ్లీ రెగ్యులర్‌గా ఆడే నెం.4లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి వచ్చాడు. దాంతో ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఆడారు.
రెస్ట్ తీసుకున్న బుమ్రా
ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. దాంతో అడిలైడ్ టెస్టులోనూ గెలవాలని ఆశిస్తున్న టీమిండియా ఈ వార్మప్ మ్యాచ్‌ని చాలా నిబద్ధతతో ఆడింది. జస్‌ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకోగా.. మహ్మద్ సిరాజ్, అక్షదీప్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ బౌలింగ్ చేశారు. పెర్త్ టెస్టులో ఆడని రవీంద్ర జడేజా.. ఈ వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయడం గమనార్హం. దాంతో అడిలైడ్ టెస్టులో తుది జట్టులో మార్పులు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి.