Tiurmala : అసలే ఘాట్ రోడ్డు.. ఆపై భారీ వర్షం.. యువకుల వెకిలి చేష్టలపై భక్తుల ఆగ్రహం
Tiurmala : ఫెంగల్ తుపాను తిరుపతి జిల్లాపై పంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుమల కొండపై వర్షం దంచికొడుతోంది. దీంతో కొండిచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. అటు ఘాట్ రోడ్డులో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కుర్రాళ్లు ఘాట్ రోడ్డు హల్ చల్ చేశారు.
తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకుల హల్ చల్ చేశారు. కారు డోర్లు ఓపెన్ చేసి.. అరుపులు, కేకలు వేశారు. వర్షంలో తడుస్తూ.. సెల్ఫీలు తీసుకుంటూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. యువకులు చేసిన హంగామాతో తోటి వాహనదారులు, భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. సదరు యువకులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఇలాంటి పనుల కారణంగా.. వారే కాకుండా ఇతర వాహనదారులూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో టీటీడీ పాలక మండలి పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది. అటు తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తారు. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసిన నేపథ్యంలోనే.. తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమార ధార, పసుపు ధార జలాశయాలకు పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చింది.
టీటీడీ మార్గదర్శకాలు..
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3వ తేదీ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. డిసెంబరు 2వ తేదీ తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.
1.తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు (ఉదయం 3 నుండి ఉదయం 5 గంటల మధ్య) జారీ చేయనున్నారు.
2.ముందుగా వచ్చినవారికి తొలి ప్రాధాన్యతతో టోకెన్లు కేటాయిస్తారు.
3.దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి.
4.టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.
5.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఫుట్ పాత్ హాల్ క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
6.ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు.
7.స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.