AP Waqf Board Cancelled : వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం, జీవో నెంబర్ 47ను ఉపసంహరణ-ap govt cancelled waqf board withdrawal go number 47 minister md faruk stats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Waqf Board Cancelled : వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం, జీవో నెంబర్ 47ను ఉపసంహరణ

AP Waqf Board Cancelled : వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం, జీవో నెంబర్ 47ను ఉపసంహరణ

HT Telugu Desk HT Telugu
Dec 01, 2024 04:35 PM IST

AP Waqf Board Cancelled : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో నెంబ‌ర్ 47ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.

వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం, జీవో నెంబర్ 47ను ఉపసంహరణ
వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం, జీవో నెంబర్ 47ను ఉపసంహరణ

రాష్ట్రంలో వ‌క్ఫ్ బోర్డు ర‌ద్దు చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబ‌ర్ 47ను ఉప‌సంహ‌రించుకుంది. దీంతో రాష్ట్రంలోని వ‌క్ఫ్ బోర్డు ర‌ద్దు కానుంది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేర‌కే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర న్యాయ‌, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫ‌రూక్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో నెంబ‌ర్ 47ను ఉపసంహరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో నెంబ‌ర్ 75 విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

2023 అక్టోబ‌ర్ 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేస్తూ జీవో నెంబ‌ర్ 47ని విడుద‌ల చేసింది. ఎన్నికైన స‌భ్యులు ఎండీ. రుహుల్లా (ఎమ్మెల్సీ), హాఫీజ్ ఖాన్ (ఎమ్మెల్యే), షేక్ ఖాజా, నామినేటేడ్ స‌భ్యులు ఖాదీర్ బాషా, మీరా హుహ్సేన్, షాఫీ అహ్మద్ ఖాద్రీ, షీరీన్ బేగం (ఐపీఎస్), బ‌ర‌క‌త్ అలీ, జే న‌జీర్ బాషా, ప‌ట‌న్ షాఫీ అహ్మద్‌, హాసీనా బేగంల‌తో వ‌క్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు.

అయితే ఈ నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు 2023 న‌వంబ‌ర్ 1న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ రకాల న్యాయపరమైన సమస్యల తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పును ప‌రిశీలించి, గత ప్రభుత్వం జారీ చేసిన, వివాదాస్పదమైన 47 జీవోను ర‌ద్దు చేసింది. జీవో నెంబ‌ర్ 47ను ర‌ద్దు చేస్తూ కూట‌మి ప్రభుత్వం నూతనంగా జీవో నెంబర్ 75ను విడుద‌ల చేసింది.

వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. కూట‌మి ప్రభుత్వంతోనే మైనారిటీ సంక్షేమం సాధ్యమ‌ని తెలిపారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం