Rajahmundry to Mumbai Flight : నెరవేరిన 20 ఏళ్ల కల.. రాజమండ్రి నుంచి ముంబయి ఎయిర్‌బస్ విమాన సర్వీసు ప్రారంభం
Rajahmundry to Mumbai Flight : రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఇక్కడి నుంచి ముంబయికి ఎయిర్ బస్ స్టార్ట్ అయ్యింది. అటు రేణిగుంట- ముంబయి మధ్య కూడా డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయ్యింది. దీనిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజమండ్రి నుంచి ముంబై ఎయిర్‌బస్ విమాన సర్వీసు ఆదివారం రాత్రి ప్రారంభం అయ్యింది. 114 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి టేకాఫ్ అయ్యింది. 173 మంది ప్రయాణికులతో ముంబై నుంచి రాజమండ్రికి ఫ్లైట్ వచ్చింది. రన్‌వే పై వాటన్ కెనాన్ సెల్యూట్‌తో దీనికి స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్ బస్ రావడం ఇదే తోలిసారి కావడం గమనార్హం.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గొరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, బత్తుల బలరామకృష్ణ తదితరులు టెర్మినల్ వద్ద నిల్చొని ప్రయాణికులకు స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు.
20 ఏళ్లుగా విమాన ప్రయాణం చేస్తున్నామని, రాజమండ్రి నుంచి ముంబయి వెళ్లాలంటే సమయం, ఖర్చు ఎక్కువయ్యేవని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పుడు ఎయిర్ బస్ ఏర్పాటుతో నేరుగా ప్రయాణం వీలైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముంబయి, ఢిల్లీ సర్వీసులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు ఎయిర్ బస్‌లు ఏర్పాటు చేయడంతో.. నగరం అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రానికి చెందినవారు కావడంతో ఈ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడుతున్నట్లేనని రాజమండ్రి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబయి, ఢిల్లీ సర్వీసులను ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని.. ఇప్పటికి అది నెరవేరిందని చెబుతున్నారు.
ముంబయి- రేణిగుంట మధ్య..
ముంబయి నుంచి రేణిగుంట మధ్య ఇండిగో సంస్థ విమాన సర్వీసును ప్రారంభించినట్టు.. విమానశ్రయ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె వెల్లడించారు. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు ముంబయిలో బయలుదేరుతుంది. 7.15 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. 7.45 గంటలకు రేణిగుంటలో బయలుదేరి.. 9.25 గంటలకు ముంబయికి చేరుకుంటుంది.
186 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానం.. ఆదివారం ఉదయం 183 మందితో రేణిగుంటకు చేరుకుంది. 186 మందితో తిరిగి ముంబయికి వెళ్లింది. ముంబయి- రేణిగుంట్ మధ్య డెరెక్ట్ ఫ్లైట్ నడపాలని ఇటీవల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. దీంతో కొద్ది రోజుల్లోనే విమాన సర్వీసు ప్రారంభం అయ్యింది.