RGV on Pushpa 2 Tickets: సినిమా టికెట్ల ధరల మీదే మీ ఏడుపెందుకు?: సుబ్బారావు ఇడ్లీలంటూ పుష్ప 2పై ఆర్జీవీ ట్వీట్ వైరల్-rgv on pushpa 2 ticket prices says do not watch if you can not afford ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv On Pushpa 2 Tickets: సినిమా టికెట్ల ధరల మీదే మీ ఏడుపెందుకు?: సుబ్బారావు ఇడ్లీలంటూ పుష్ప 2పై ఆర్జీవీ ట్వీట్ వైరల్

RGV on Pushpa 2 Tickets: సినిమా టికెట్ల ధరల మీదే మీ ఏడుపెందుకు?: సుబ్బారావు ఇడ్లీలంటూ పుష్ప 2పై ఆర్జీవీ ట్వీట్ వైరల్

Hari Prasad S HT Telugu

RGV on Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్ల ధరలను భారీగా పెంచడంపై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు. సినిమా టికెట్ల ధరలపైనే మీ ఏడుపెందుకు.. ఇష్టం లేకపోతే చూడకండి అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

సినిమా టికెట్ల ధరల మీదే మీ ఏడుపెందుకు?: సుబ్బారావు ఇడ్లీలంటూ పుష్ప 2పై ఆర్జీవీ ట్వీట్ వైరల్

RGV on Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్ల ధర పెంపుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. సినిమా టికెట్ల ధరలపైనే ఎందుకు ఏడుపు.. ఇష్టం లేకపోతే చూడకండి అంటూ.. సుబ్బారావు ఇడ్లీలనే ఓ స్టోరీ కూడా చెప్పాడు. పుష్ప 2 రిలీజ్ కు ఒక రోజు ముందు ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఆర్జీవీ ఏమన్నాడంటే?

పుష్ప 2 టికెట్ల ధరలను భారీగా పెంచేయడంపై విమర్శలు రావడంతోపాటు కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలవుతున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో బుధవారం (డిసెంబర్ 4) ఉదయం ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. అందులో పుష్ప 2 టికెట్ల ధరలను సుబ్బారావు ఇడ్లీలతో పోలుస్తూ అతడు ఓ కథ చెప్పాడు. అతని ట్వీట్ లో ఏముందో ఆర్జీవీ మాటల్లోనే చూడండి.

"పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2.. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం.

ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమా. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?

ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చు, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా? మళ్లీ సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి" అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

పుష్ప 2 టికెట్ల ధరలు

పుష్ప 2 మూవీ గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కానుండగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో తెలంగాణలో కొన్ని చోట్ల టికెట్ ధర రూ.1200 వరకూ ఉంది. అటు ఢిల్లీలో అయితే ఈ టికెట్ గరిష్ఠంగా రూ.2 వేల వరకూ కూడా ఉండటం గమనార్హం. ఈ టికెట్ల ధరలపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. మూవీ రిలీజ్ వాయిదాకు కోర్టు అంగీకరించలేదు.