YS Sharmila : అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా..? సెకీ ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం - వైఎస్ షర్మిల
అదానీ ముడుపుల కేసు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. జగన్ అవినీతి, నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. తాను పర్సనల్ గా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి కూడా అడుగు బయటపెట్టరంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పై రేపు ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదానీతో చేసిన ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు డీల్ రద్దు చేయడానికి చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయిందని… మరి మీ సూపర్ సిక్స్ ఎక్కడ? అని షర్మిల నిలదీశారు. సూపర్ సిక్స్ పథకాలను కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని…ఈ విషయం చంద్రబాబు కి తెలుసన్నారు.
“రైతుకి 20 వేల ఆర్థిక సహాయం అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 20 లక్షల ఉద్యోగాల విషయంలో ఎప్పుడు కల్పిస్తారు.. టైమ్ బాండ్ అంటూ ఏమీ లేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15 వేలు ఇస్తా అన్నారు.. ఈ ఏడాది గడిచి పోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు” అని విమర్శలు గుప్పించారు.
మీది అతి తెలివినా..? వెర్రితనమా..?
అదానీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 1750 కోట్లు ముడుపులు తీసుకున్నారని షర్మిల చెప్పారు."ఈ అంశంపై అమెరికా కోర్టుల్లో కేసు నమోదు అయింది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు. చంద్రబాబు.. అదానీ పేరు కూడా ఎత్తడం లేదు. జగన్ కి చంద్రబాబు కి ఏమిటి తేడా ? జగన్.. రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టాడు. నా పేరు లేదు అని జగన్ అతి తెలివిగా మాట్లాడాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా ? మీది అతి తెలివినా? వెర్రితనమా ? రాష్ట్రానికి 25 ఏళ్లు అదానీ పవర్ ఒక భారంపక్క రాష్ట్రాల్లో 1.99 పైసలు అమ్ముతుంటే...ఇక్కడ 2.49 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొన్నారు?" అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
"జగన్ గారు ఎందుకు 25 ఏళ్లకు అదానీ తో ఒప్పందం చేశారు..? టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. కోర్టు లో కూడా కేసులు వేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశాడు. మరి మీరు అధికారంలో ఉన్నారు. ఈ విషయం పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ఎందుకు మౌనంగా ఉన్నారు ? మీరు జగన్ చేసిన డీల్స్ రద్దు చేయలేదు అంటే... అవి సక్రమం అని ఒప్పుకుంటారా ? లేక అదానీ కి చంద్రబాబు బయపడుతున్నారా?" అని షర్మిల నిలదీశారు.
వైసీపీ నేతలకు కౌంటర్…
వైసీపీ నేతల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాను మాట్లాడేది పర్సనల్ కాదని చెప్పుకొచ్చారు. “నేను పర్సనల్ మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడు. మీరు మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు. రుషికొండను లేకుండా చేశారు. మీ నిర్లక్ష్యాన్ని, అవినీతిని మాత్రమే నేను ప్రశ్నించాయ 1750 కోట్ల ముడుపులు అడిగితే పర్సనల్ అవుతుందా ? వివేకా హత్య మీద మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతుంది. గంగవరం పోర్టు అమ్మేశారు అంటే పర్సనల్ అవుతుందా ? సోషల్ మీడియా లో సైతాన్ సైన్యం గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా?”దీనికి వైసీపీ నేతల సమాధానం చెప్పాలి.
సెకీ ఒప్పందాల పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. జగన్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా… ప్రభుత్వం, నేతల వైఫల్యాలను ఎత్తి చూపడం తన విధి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా పర్సనల్ అని అంటే... ఎలా ? అని వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం