Jagan Comments on Adani : అదానీని చాలాసార్లు కలిశా.. చంద్రబాబు నాకు సన్మానం చేయాలి: జగన్
Jagan Comments on Adani : ఏపీలో అదానీ వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై జగన్ తొలిసారి స్పందించారు. అదానీని చాలాసార్లు కలిశానని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కేసులు వేస్తానని హెచ్చరించారు.
ఆంధ్రా రాజకీయాల్ని కుదిపేస్తున్న అదానీ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. తాడేపల్లి నివాసంలో మీడియాతో మాట్లాడిన జగన్.. చాలా అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఎఫ్‌బీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేదని వివరించారు. తనకు లంచం ఆఫర్ చేసినట్టు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అదానీని చాలాసార్లు కలిశా. రాష్ట్రంలో అదానీకి చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా. నా పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తాం. పరువు నష్టం దావాలు వేయబోతున్నాం. అమెరికాలో పెట్టిన కేసు గురించి నాకు తెలియదు. బైడెన్ పేరు ఉంటే ఆయనను అడుగుతారా' అని జగన్ ప్రశ్నించారు.
'తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే.. నన్ను పొగాల్సిందిపోయి.. నన్ను సన్మానించాల్సింది పోయి ఇవన్నీ అభాండాలు వేస్తున్నారు. 2.49 రూపాయలకు నేను కరెంట్ తీసుకొచ్చా. ధర్మం, న్యాయం ఉండాలి కదా.. మంచి చేసినోడి మీద రాళ్లు వేయడం ఏంటీ. ప్రభుత్వ ఖజానాకి భారం తగ్గించడం కూడా సంపద సృష్టే కదా?.. ఏమంటావ్ నారా చంద్రబాబు నాయుడు' అని జగన్ ప్రశ్నించారు.
'రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోంది. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్‌లతో పాటు.. పేకాట క్లబ్బులే కనిపిస్తున్నాయి. కలెక్షన్ మెకానిజంతో మాఫియా నడుస్తోంది. ఆరోగ్యశ్రీలో రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. విద్యాదీవెన లేక డ్రాపౌట్లు పెరుగుతున్నాయి.' అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'వాలంటీర్లకి రెట్టింపు వేతనం ఇస్తానని హామీలిచ్చిన చంద్రబాబు.. గెలిచాక ఉన్న ఉద్యోగాలకే ఎసరుపెట్టేశారు. గ్రామాల్లోనే వందలాది సేవలు అందిస్తూ గ్రామ స్వరాజ్యం సాధించాం. ప్రజలకి వ్యయ ప్రయాసలు లేకుండా గుమ్మం ముందుకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఐదేళ్లు అభివృద్ధి దిశగా అడుగులు వేసిన రాష్ట్రం.. ఆరు నెలలుగా తిరోగమనం దిశగా వెళ్తోంది' అని జగన్ విమర్శించారు.
'గడప వద్దకే మెరుగైన వైద్యాన్ని తీసుకొచ్చి.. ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేశాం. డేట్ చెప్పి మరీ పథకాలు అందించాం. ఏ ఒక్కర్నీ విస్మరించకుండా నిష్పక్షపాతంగా అందించాం. ఐదేళ్లు ఆరోగ్యశ్రీతో పేదోళ్ల ఆరోగ్యానికి భద్రతతో పాటు భరోసాగా నిలిచాం. సాధ్యమేనా అని ఎగతాళి చేసిన వాళ్లు ముక్కున వేలేసుకునేలా చేశాం. కార్పొరేట్ స్కూళ్లకి సర్కారు బడి పోటీని ఇవ్వగలదా? అనే పరిస్థితులను నుంచి కార్పొరేట్ స్కూళ్లు అసూయపడేలా ఐదేళ్లలో సర్కారు బడుల్ని తీర్చిదిద్దాం' అని జగన్ వ్యాఖ్యానించారు.