Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో నిలిపివేత-power generation in nagarjuna sagar stopped due to krmb intervention ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో నిలిపివేత

Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో నిలిపివేత

HT Telugu Desk HT Telugu
Nov 19, 2024 05:32 PM IST

Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. కేఆర్ఎంబీ జోక్యంతో విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో నిలిపివేసింది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1657 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. అటు శ్రీశైలంలో 1646 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్టు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌
నాగార్జునసాగర్‌

నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిని నిలిపివేసింది. ఈసారి వర్షాకాలం సీజన్‌లో ఎగువ కృష్ణా నుంచి ఎక్కవ ఇన్ ఫ్లో ఉంది. దీంతో సాగర్ జలాశయం గడిచిన మూడు నెలలకుపైగా నిండు కుండలా ఉంది. నాగార్జున సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుని దిగువకు నీటిని విడుదల చేసింది. దీంతో అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్ జలాశయాల వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రికార్డు స్థాయిలో కరెంటు తయారైంది.

అయితే, జల విద్యుత్ కోసం జలశాయాలను ఖాళీ చేస్తున్నారంటూ కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్‌మెంట్ (కేఆర్ఎంబీ) హెచ్చరించింది. తక్షణం ఉత్పత్తిని నిలిపివేయాలని సూచించింది. దీంతో నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో ఆదివారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని.. జెన్‌కో సీఈ మంగేష్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీ నుంచి ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టారు.

లక్ష్యాన్ని మించి..

నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో 8 టర్బైన్లు ఉన్నాయి. ఒక్కో టర్బైన్ సామర్ధ్యం 110 మిలియన్ యూనిట్లు. దాదాపు ఏడాది కిందటే రిపేర్ గురైన రెండో నంబర్ టర్బైన్ ద్వారా ఈసారి ఉత్తత్తి లేదు. కేవలం ఏడు టర్బైన్ల ద్వారానే ఈ ఏడాది జులై 24వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు విద్యుత్ ఉత్పత్తి జరిగింది.

ఈ ఏడాది లక్ష్యం 1400 మిలియన్ యూనిట్లు కాగా.. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన 16వ తేదీ నాటికి (అంటే కేవలం నాలుగు నెలల లోపే) 1657 మిలియన్ యూనిట్ల పైచీలుకు విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత నెలలోనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు జెన్‌కో వర్గాలు తెలిపాయి. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల సాగర్ జలాశయం దాదాపు ఖాళీ అయ్యింది. వరద లేని కారణంగా గత సంవత్సరం కేవలం 540 మిలయిన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు.

వాస్తవానికి గత సంవత్సరం 1530 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని నిర్ధేశించినా.. కేవలం 540 మిలియన్ యూనిట్లు మాత్రమే చేయగలిగారు. ఈ ఏడాది జలాశయానికి జూలై నుంచి వరదలు మొదలయ్యాయి. ఈసారి లక్ష్యాన్ని అధిగమించారు. మరోవైపు ఎగువున ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 1646 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. సాగర్ జలశాయానికి ఉన్న ప్రధాన జలవిద్యుత్ కేంద్రంతో పాటు, కుడి ఎడమ కాల్వలపైనా విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఎడమ కాల్వపై 60 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది.

(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ జిల్లా కరస్పాండెంట్)

Whats_app_banner