Vizag Steel Plant: గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె, స్టీల్‌ప్లాంట్‌ బొగ్గు కొరత, సమ్మె విరమణకు బొత్స ఝాన్సీ విజ్ఞప్తి…-workers strike at gangavaram port shortage of steel plant coal botsa jhansis appeal to end the strike ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Vizag Steel Plant: గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె, స్టీల్‌ప్లాంట్‌ బొగ్గు కొరత, సమ్మె విరమణకు బొత్స ఝాన్సీ విజ్ఞప్తి…

Vizag Steel Plant: గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె, స్టీల్‌ప్లాంట్‌ బొగ్గు కొరత, సమ్మె విరమణకు బొత్స ఝాన్సీ విజ్ఞప్తి…

Sarath chandra.B HT Telugu

Vizag Steel Plant: గంగవరం పోర్టు నుంచి దిగుమతి చేసుకున్న 2 లక్షల టన్నుల బొగ్గును విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించడానికి అనుమతించాలని మాజీ ఎంపీ, విశాఖ వైసీపీ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి కార్మికులు, కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొరత.. (facebbok)

Vizag Steel Plant: గంగవరం పోర్టులో కార్మికుల సమ్మెతో సరుకు రవాణా నిలిచిపోయింది. గంగవరం పోర్టు నుంచి దిగుమతి చేసుకున్న దాదాపు 2 లక్షల టన్నుల కోకింగ్ బొగ్గును Coal విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించేందుకు అనుమతించాలని మాజీ ఎంపీ, వైసీపీ YCP లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి గంగవరం పోర్టు కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం (RINL)లో బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. గత కొన్ని రోజులుగా గంగవరం పోర్టులో కార్మికులు చేస్తున్న labour Protest సమ్మె కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో బొగ్గు నిల్వలు కరువవుతున్నాయి. గంగవరం పోర్టులో సుమారు రెండు లక్షల టన్నుల బొగ్గు రవాణా నిలిచిపోయింది. గంగవరం పోర్టుల నుంచి స్టీల్ ప్లాంట్ కోసం బొగ్గు రవాణాకు అనుమతించాలని సమ్మె చేస్తున్న కార్మికులు, యూనియన్లను కోరినట్టు బొత్స ఝాన్సీ తెలిపారు.

తమ డిమాండ్ల పరిష్కారంలో గంగవరం పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పోర్టు కార్మికులు కొద్ది రోజుల క్రితం సమ్మెకు దిగారు. సంక్షోభం ఇలాగే కొనసాగితే ప్లాంట్ మౌలిక సదుపాయాలకు శాశ్వత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని బొత్స ఝాన్సీ కార్మికుల్ని కోరారు.

బొగ్గు కొరత కారణంగా స్టీల్ ప్లాంట్ మూతపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తగినంత కోకింగ్ బొగ్గు లేకపోవడం, కోక్ ఓవెన్లు పనిచేయకపోవడం వల్ల కోక్ ఓవెన్ బ్యాటరీలతో పాటు, కోక్ ఓవెన్లకు కోలుకోలేని శాశ్వత నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

మెరుగైన మార్కెట్ పరిస్థితులు, మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నిర్వహణతో విశాఖ ఉక్కు కర్మాగారం పుంజుకుందని, అయితే కోకింగ్ బొగ్గు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో రెండు ఇప్పుేడు మూతపడే ప్రమాదం ఉందని బొత్స ఝాన్సీ తెలిపారు.

బ్లాస్ట్ ఫర్నేస్‌ మాదిరిగా కాకుండా, కోక్ ఓవెన్ లు ఎల్లప్పుడూ పనిచేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. కోకింగ్ బొగ్గు సంక్షోభాన్ని నివారించకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌ మీద రూ.20 వేల కోట్ల భారం పడుతుందని, స్టీల్ ప్లాంట్‌లోని 20 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని, ఇది మరింత తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని వివరించారు.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, గంగవరం పోర్టు యూనియన్ల కృషితో సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కోకింగ్ కోల్‌ తరలింపునకు అనుమతించాలని గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్‌ను, కార్మికుల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని, షట్ డౌన్ కు అవకాశం లేకుండా చూడాలని జిల్లా, ఆర్ ఐఎన్ ఎల్ అధికారులను కోరారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో బొగ్గు నిల్వలపై పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశానని విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు గనులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. . స్టీల్ ప్లాంట్‌ కోసం ప్రభుత్వం క్యాప్టివ్ బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఉంటే ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేవాళ్లం కాదని బొత్స ఝాన్సీ అన్నారు.

సంబంధిత కథనం