YS Jagan Assets Case : రెండు వారాల్లోగా జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు ఇవ్వండి - సుప్రీంకోర్టు ఆదేశాలు-supreme court orders cbi ed to give total details of ys jagan disproportionate assets case details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Assets Case : రెండు వారాల్లోగా జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు ఇవ్వండి - సుప్రీంకోర్టు ఆదేశాలు

YS Jagan Assets Case : రెండు వారాల్లోగా జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు ఇవ్వండి - సుప్రీంకోర్టు ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 02, 2024 02:35 PM IST

YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యమవుతోందని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.

రెండు వారాల్లోగా జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు ఇవ్వండి - సుప్రీంకోర్టు ఆదేశాలు
రెండు వారాల్లోగా జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు ఇవ్వండి - సుప్రీంకోర్టు ఆదేశాలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటు ఈడీ, సీబీఐ కేసుల వివరాలు విడిగా చార్ట్‌ రూపంలో అందించాలని సూచించింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ల పాటు కొనసాగుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం... ఇరుపక్షాల వాదనలు విన్నది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు రోజువారీ పద్ధతిలో విచారణకు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు తెలియజేశారు. విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

జగన్ అక్రమాస్తుల విషయంలో పలు కోర్టుల్లో డిశ్చార్జ్‌, వాయిదా పిటిషన్లు విచారణలో ఉన్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలు ఇవ్వాలని ఈడీ, సీబీఐ కు తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పింది. తెలంగాణ హైకోర్టు, ట్రయల్‌ కోర్టులో పిటిషన్లు, పెండింగ్‌ కేసుల వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

సజ్జల భార్గవరెడ్డికి షాక్

వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై పెట్టిన కేసులు కొట్టివేయాలని సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారించిన సుప్రీం ధర్మాసనం.. కేసులు కొట్టివేతకు నిరాకరించింది. అలాగే ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన సజ్జల భార్గవరెడ్డి పిటిషన్‌ తిరస్కరించింది. సజ్జల తన వాదనలను హైకోర్టులో వినిపించాలని సూచించింది. అతను హైకోర్టును ఆశ్రయించేంత రెండు వారాల పాటు అరెస్ట్ చేయకూడదని మధ్యంతర రక్షణ కల్పించింది.

రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? వద్దా? అనే విషయాన్ని హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా...కూటమి నేతలపై సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను...ధర్మాసనం దృష్టిని తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ పోస్టులన్నీ ఆమోదయోగంగా లేవని అభిప్రాయపడింది.

తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవరెడ్డి ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై నవంబర్ 29న విచారణ జరిగింది. వీటిపై తదుపరి విచారణ డిసెంబర్ 6న జరుగనుంది. సజ్జల భార్గవరెడ్డిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు సైతం పోలీసులను ఆదేశించింది. అయితే తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని భార్గవరెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించగా…అందుకు ధర్మాసనం నిరాకరించింది.

Whats_app_banner