Harsh Bardhan : మాటలకందని విషాదం! మొదటి పోస్టింగ్​కి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్​ అధికారి మృతి..-who was harsh bardhan ips officer who died just before his first posting ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Harsh Bardhan : మాటలకందని విషాదం! మొదటి పోస్టింగ్​కి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్​ అధికారి మృతి..

Harsh Bardhan : మాటలకందని విషాదం! మొదటి పోస్టింగ్​కి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్​ అధికారి మృతి..

Sharath Chitturi HT Telugu
Dec 02, 2024 02:03 PM IST

Harsh Bardhan IPS : కర్ణాటకలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది! మొదటి పోస్టింగ్​కి బయలుదేరిన హర్ష్​ బర్దన్​ అనే 26ఏళ్ల ఐపీఎస్​ అధికారి, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన హర్ష్​ బర్దన్​
రోడ్డు ప్రమాదంలో మరణించిన హర్ష్​ బర్దన్​

కర్ణాటకలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకంది. హర్ష్​ బర్దన్​ అనే 26ఏళ్ల ఐపీఎస్​ అధికారి.. మొదటి పోస్టింగ్​కి వెళుతూ, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు!

ఇదీ జరిగింది..

డిసెంబర్ 1న ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. హర్ష్ బర్దన్ హసన్ జిల్లాలోని హోలెనరసిపూర్​లో ప్రొబేషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్​గా తన మొదటి పోస్టింగ్​ను చేపట్టడానికి బయలుదేరారు. హసన్-మైసూరు హైవేపై కిట్టానె సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైర్ ఒక్కసారిగా పేలిందని తెలుస్తంది. ఫలితంగా ఈ ప్రమాదం జరిగింది. టైర్​ పేలడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిని, చెట్టును ఢీకొట్టింది.

హర్ష్ బర్దన్ ఎవరు?

మధ్యప్రదేశ్​కు చెందిన ఐపీఎస్​ అధికారి హర్ష్ ఇటీవల మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అంకితభావం, ప్రొఫెషనలిజానికి పేరుగాంచిన ఈ యువ అధికారి ప్రజాసేవ పట్ల తన నిబద్ధతతో తన మెంటర్స్​ని, సహచరులను ఆకట్టుకున్నారు. సమాజానికి అర్థవంతమైన సహకారం అందించాలనే తపన ఉన్న దృఢ సంకల్పం, కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయన్ని ఆయన కుటుంబం అభివర్ణించింది.

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన అఖిలేష్ కుమార్ సింగ్, గృహిణి అయిన డాలీ సింగ్ దంపతులకు జన్మించారు హర్ష్ బర్దన్​. వారి కుటుంబం ప్రజాసేవలో చురుకుగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్​లో తండ్రి చేసిన సర్వీస్​ని చూడటంతో హర్ష్​ బర్దన్​ ఐపీఎస్​వైపు అడుగులు వేశారు. 2023 ఐపీఎస్​ బ్యాచ్​లో చేరికతో తన కలను నెరవేర్చుకున్నారు.

హర్ష్ హసన్​లో విధులకు రిపోర్ట్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆయన్ని, మంజేగౌడ అనే డ్రైవర్​ను రక్షించారు. కాగా హాస్పిటల్​కి తరలించే ముందే హర్ష్ మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రజాసేవలో తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్న ఇలాంటి యువ, ఆశావహ అధికారిని కోల్పోవడం చాలా బాధాకరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటనలో ఏళ్ల తరబడి శ్రమ, అంకితభావం కోల్పోయామని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో..

దేశంలో నిత్యం ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంటోంది. అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మృతి చెందారు. వీరంతా బళ్లారికి చెందినవారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు పూర్తి చేసి మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు అయిపోయింది.ప్రమాద దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం