OTT Web Series: ఓటీటీలోకి రెండో సీజన్‌తో వస్తున్న సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్-ott web series bandish bandits season 2 trailer released to stream on prime video 13th december ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Web Series: ఓటీటీలోకి రెండో సీజన్‌తో వస్తున్న సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Web Series: ఓటీటీలోకి రెండో సీజన్‌తో వస్తున్న సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Dec 02, 2024 02:09 PM IST

OTT Web Series: ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్ రెండో సీజన్ తో వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (డిసెంబర్ 2) ఈ కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి రెండో సీజన్‌తో వస్తున్న సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రెండో సీజన్‌తో వస్తున్న సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Web Series: ఓటీటీ ప్రేక్షకులను మరోసారి మధురమైన సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రైమ్ వీడియో అందిస్తున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ బండిష్ బాండిట్స్ (Bandish Bandits) వచ్చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ కు సంబంధించిన ట్రైలర్ ను సోమవారం (డిసెంబర్ 2) రిలీజ్ చేశారు. ఈసారి తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించే ఆ ఇద్దరు ప్రేమికుల మధ్య మ్యూజికల్ వార్ జరగనుంది.

బండిష్ బాండిట్స్ రెండో సీజన్ ట్రైలర్

సాంప్రదాయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, ఆధునిక పాశ్చాత్య సంగీతం మధ్య సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే. ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన వెబ్ సిరీసే బండిష్ బాండిట్స్. నాలుగేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో తొలి సీజన్ స్ట్రీమింగ్ అయింది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 13 నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు గతంలోనే అనౌన్స్ చేయగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

తన ఘనమైన వంశ సంగీత వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడే రాధే (రిత్విక్ భౌమిక్) అనే యువకుడు, ఆధునిక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడే తమన్నా (శ్రేయా చౌదరి) మధ్య ఉండే ప్రేమ.. సంఘర్షణగా ఎలా మారింది? ఈ ఇద్దరి మధ్య పోటీలో చివరికి గెలిచి నిలిచేది ఎవరు అన్నది రెండో సీజన్లో చూడొచ్చు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

బండిష్ బాండిట్స్ తొలి సీజన్ మొత్తం రాధేకు చెందిన రాథోడ్ వంశ ఘనమైన సంగీత వారసత్వం చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ తివారీ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రెండో సీజన్ ఆ వంశ ప్రతిష్ట ఎలా దిగజారిపోతుంది? ఆ దిగజారిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి రాధే ఎలాంటి ప్రయత్నం చేశాడు?

ఈ క్రమంలో తన ప్రేయసి నుంచే అతడు ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నాడన్నది ఈ రెండో సీజన్ లో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తూ స్పష్టమవుతోంది. రాధే పాత్రలో తొలి సీజన్ లో అదరగొట్టిన రిత్విక్ భౌమిక్.. ఇప్పుడు రెండో సీజన్ కు అదే పాత్రలో తిరిగి వస్తున్నాడు. ఇక అటు ఆధునిక పాశ్చాత్య సంగీతంపై పట్టు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకోవాలనుకుంటున్న అమ్మాయి తమన్నా పాత్రలో శ్రేయా చౌదరి జీవించేసింది.

ఇప్పుడీ ఇద్దరూ మరోసారి అలరించడానికి డిసెంబర్ 13 నుంచి బండిష్ బాండిట్స్ రెండో సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ట్రైలర్ ఈ రెండో సీజన్ పై అంచనాలను పెంచేసింది. తొలి సీజన్ కు ఐఎండీబీలో 8.6 రేటింగ్ రావడం విశేషం. మరి ఈ రెండో సీజన్ ఏం చేస్తుందో చూడాలి. తొలి సీజన్ ఇప్పటికే తెలుగులోనూ అందుబాటులో ఉంది. రెండో సీజన్ కూడా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner