Namrata: సింహానికి మహేశ్ బాబు వాయిస్- ఫ్యామిలీ ఫిల్మ్ అన్న నమ్రతా- యానిమల్స్ తమ్ముడు, అన్న అనే ఫీలింగ్ కలుగుతుందన్న హీరో
Satyadev Namrata In Mufasa The Lion King Press Meet: హాలీవుడ్ మూవీ ముఫాస ది లయన్ కింగ్‌లో సింహం పాత్రకు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో నమ్రతా శిరోద్కర్, సత్యదేవ్, అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Satyadev Namrata About Mufasa The Lion King: మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాలీవుడ్ మూవీ 'ముఫాసా: ది లయన్ కింగ్' డిసెంబర్ 20న ఇండియాలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ముఫాసా ది లయన్ కింగ్ మూవీని భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలల్లో విడుదల చేస్తున్నారు.
హిట్ మూవీకి సీక్వెల్‌గా
బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమా 2019లో లైవ్-యాక్షన్ మూవీ ది లయన్ కింగ్‌కు కొనసాగింపుగా అంటే సీక్వెల్‌గా వచ్చింది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించడానికి ముఫాస ది లయన్ కింగ్ రానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ముఫాసా అనే సింహం పాత్రకు సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో రిలీజైన ముఫాస ది లయన్ కింగ్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ సూపర్ స్టార్ మహేశ్ బాబు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
నమ్రతాతో పోస్టర్ రిలీజ్
మహేశ్ బాబు ముఫాసా ది లయన్ కింగ్ స్పెషల్ పోస్టర్‌ను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని గ్రాండ్ మీడియా ఈవెంట్లో లాంచ్ చేశారు. అలాగే, ఈ ఈవెంట్లో టాకా పాత్రకు వాయిస్ ఇచ్చిన హీరో సత్యదేవ్, టిమోన్ రోల్‌కు వాయిస్ అందించిన కమెడియన్ అలీ పాల్గొన్నారు. ఇక ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.
ఈ ప్రెస్ మీట్లో నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని మాట్లాడుతూ.. "డిస్నీ టీమ్‌కి థాంక్ యూ. చాలా శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్‌ని చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని డబ్ చేయడం ఒక ఛాలెంజ్. డిస్నీ టీమ్ చాలా ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. మహేష్ బాబు గారు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.
నా భుజంపై చేయి వేసి
ఇక హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మన వాయిస్ డిస్నీ లైబ్రెరీలో ఉండటం అనేది గ్రేట్ అచీవ్మెంట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఓ సీన్లో మహేశ్ బాబు గారు నా భుజంపై చెయి వేస్తూ మాట్లాడతారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తర్వాత సరిలేరు నికెవ్వరులో ఒక క్యారెక్టర్ చేశాను" అని అన్నాడు.
"ఇప్పుడు మహేశ్ బాబు గారితో కలసి టాకా అనే క్యారెక్టర్‌కి వాయిస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ ఎమోషన్లో ఉండటం వలన యానిమల్స్‌ని చూస్తే తమ్ముడు, అన్న అనే ఫీలింగ్ కలిగేది (నవ్వుతూ). ముఫాసా పాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మహేశ్ గారి పంచ్‌లు అద్భుతంగా పేలాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు" అని సత్యదేవ్ తెలిపాడు.
200 ఏళ్లు ఉండిపోతుంది
"డిస్నీ వారికి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్‌కు డబ్బింగ్ చెప్పడం వెరీ స్పెషల్. ది లయన్ కింగ్ సినిమా మన అందరికీ నచ్చింది. ఇప్పుడు ముఫాసా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మహేశ్ గారు ముఫాసాకి డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది" అని కమెడియన్ అలీ అన్నారు.
"సినిమాలో టిమోన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. డిస్నీ లైబ్రెరీలో నా వాయిస్ రెండు వందల సంవత్సరాలు ఉండిపోతుంది. ఒక యాక్టర్‌కి కావాల్సింది ఇదే. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది" అని కమెడియన్ అలీ చెప్పారు.