Mahesh Babu: రెండున్నర ఎకరాలు కొన్న మహేష్ బాబు.. రిజిస్ట్రేషన్‌కు భార్య నమ్రతా.. ఎక్కడంటే?-mahesh babu buys two and half acres land in hyderabad and registration on namrata shirodkar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: రెండున్నర ఎకరాలు కొన్న మహేష్ బాబు.. రిజిస్ట్రేషన్‌కు భార్య నమ్రతా.. ఎక్కడంటే?

Mahesh Babu: రెండున్నర ఎకరాలు కొన్న మహేష్ బాబు.. రిజిస్ట్రేషన్‌కు భార్య నమ్రతా.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 10, 2024 09:19 AM IST

Mahesh Babu Buys 2.5 Acres In Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ శివార్లలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వెళ్లినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో రెండున్నర ఎకరాలు కొన్న మహేష్ బాబు.. రిజిస్ట్రేషన్‌కు భార్య నమ్రతా
హైదరాబాద్‌లో రెండున్నర ఎకరాలు కొన్న మహేష్ బాబు.. రిజిస్ట్రేషన్‌కు భార్య నమ్రతా

Mahesh Babu Namrata Land Registration: ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోగా సత్తా చాటుతూ వస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ఒక్కో మూవీకి రూ. 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్. ఇదిలా ఉంటే, తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ ల్యాండ్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు సమాచారం.

yearly horoscope entry point

హైదరాబాద్ శివార్లలోని 2.5 ఎకరాల భూమిని సూపర్ స్టార్ మహేష్ బాబు కొనుగోలు చేశారు. శంకర్ పల్లి సమీపంలోని గోపులారం పరిధిలో ఈ భూమిని కొన్నారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం బుధవారం (మార్చి 6) శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వెళ్లారు. అలాగే అక్కడ రిజిస్ట్రేషన్ పనులు ముగించుకున్నారు. మహేష్ బాబు కొనుగోలు చేసిన శంకర్ పల్లి పరిధిలోని రెండున్నర ఎకరాల భూమి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

ఇక శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నమ్రతా శిరోద్కర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఇంట్రెస్ట్ చూపించారు. నమ్రతా కూడా ఎంతో ఓపికగా వారందరికీ సెల్ఫీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారితోపాటు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది సైతం నమ్రతాతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు మహేష్ బాబు భార్య వచ్చిన విషయం తెలిసి కొంతమంది స్థానికులు నమ్రతాను చూసేందుకు అక్కడికి వచ్చారు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలు, ఫిట్ నెస్ వంటి వాటితో బిజీగా ఉంటే కుటుంబ, వ్యాపార వ్యవహరాలను నమ్రతా శిరోద్కర్ పూర్తిగా చూసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తనకు మహేష్ బాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు గతంలో ఆమెతో పాటు సూపర్ స్టార్ కూడా చెప్పుకొచ్చారు. కాగా మహేష్ బాబు ఇప్పటికే హైదరాబాద్‌లో పలు మల్టిప్లెక్స్‌లు, రెస్టారెంట్లను రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలన్ని నమ్రతనే చూసుకుంటారు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు త్వరలో దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాకు SSMB29 వర్కింగ్ టైటిల్‌గా పిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అంతేకాకుండా, ఎస్ఎస్ఎమ్‌బీ29లో మహేష్ బాబు మొత్తం 8 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్లు ఈ మధ్య న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీకి రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇందులో హనుమంతుడి గురించి ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్‌గా స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజమౌళి త్వరలో దర్శకత్వం వహించే మహేష్ బాబు సినిమాపై గ్లోబల్‌గా అంచనాలు ఉన్నాయి.

ఇక ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నారు. మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా అంతగా రుచించలేదు. కానీ, నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న గుంటూరు కారం హిందీ వెర్షన్ కొద్దిరోజులు టాప్ 2 ట్రెండింగ్‌లో ఉంది. అలాగే తెలుగు వెర్షన్ టాప్ 4 ప్లేస్‌లో నిలిచింది.

Whats_app_banner