Naga Babu Tweet: పుష్ప 2 రిలీజ్ ముంగిట నాగబాబు ట్వీట్.. రంగంలోకి దిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
Pushpa 2 release date: అల్లు అర్జున్‌ని ఉద్దేశిస్తూ నాగబాబు మరో ట్వీట్ వదిలారు. పుష్ఫ 2 సినిమా మరో 3 రోజుల్లో విడుదల కానుండగా.. నాగబాబు చేసిన ట్వీట్‌పై జోరుగా చర్చ నడుస్తోంది.
Naga Babu Tweet for Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ ముంగిట నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు.
పరాయివాడు ట్వీట్‌తో ఇటీవల దుమారం
వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో చిరెత్రిపోయిన నాగాబాబు.. ‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’’ అంటూ ట్వీట్ చేయగా.. అప్పట్లో అది పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దెబ్బకి నాగబాబు ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడంతో పాటు.. ఎక్స్ అకౌంట్‌ను కొన్ని రోజులు డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు మరో ట్వీట్ వదిలిన నాగబాబు
పరాయివాడు ట్వీట్ తర్వాత.. నాగబాబు చాలా రోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎక్స్ వేదికగా మరో ట్వీట్ వదిలారు. ఇంతకీ నాగబాబు ఏమని అందులో రాసుకొచ్చారంటే.. ‘‘నువ్వు వెళ్లే దారి తప్పు అని గుర్తిస్తే.. వెంటనే సరిదిద్దుకో. అలా కాకుండా ఎక్కువ కాలం వేచి ఉన్నావంటే.. మళ్లీ వెనక్కి తిరిగి రావడం కష్టమవుతుంది’’ అని వివేకానంద కోట్స్‌ను నాగబాబు రాసుకొచ్చారు. నాగబాబు ఈ ట్వీట్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్‌కి ముందు బెదిరిస్తున్నావా? అంటూ నాగబాబుపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మెగా కాంపౌండ్ సైలెంట్
పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత టాలీవుడ్ నుంచి చాలా మంది నటులు.. అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి చిన్న ప్రశంస కూడా రాలేదు. ఇటీవల మట్కా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ కూడా కూడా పరోక్షంగా అల్లు అర్జున్‌పై సెటైర్ వేశారు. దాంతో మెగా, అల్లు కంపౌండ్ మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. పుష్ప 2 ప్రమోషన్స్‌లో కూడా ఎక్కడా మెగా ఫ్యామిలీ ప్రస్తావనని అల్లు అర్జున్ తీసుకు రావడం లేదు.
ఆరు భాషల్లో పుష్ప 2 రిలీజ్
పుష్ప 2 మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 స్క్రీన్లలో రిలీజ్‌కాబోతోంది. ఆరు భాషల్లో విడుదలకాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో ఒక్క రోజులోనే 6 లక్షలకిపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. 2021లో పుష్ప 1 తర్వాత వస్తున్న మూవీ కావడంతో.. అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది.