Janasena Rajyasabha: సినీనటుడు, జనసేన ముఖ్య నాయకుల్లో ఒకరైన నాగబాబుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసినప్పటి నుంచి జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో నటుడు నాగబాబు పోటీ చేయాలని భావించినా ఎన్నికల పొత్తు కారణంగా సాధ్యపడలేదు. అప్పట్లోనే నాగబాబుకు పవన్ భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే సమయంలో నాగబాబు పేరు తెరపైకి వచ్చినా ఆ పదవిని హరిప్రసాద్‌కు అప్పగించారు. నాగబాబును రాజ్యసభకు పంపాలనే విషయంలో పవన్ స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటులో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో మాత్రమే ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేదు. ప్రస్తుతం ఉన్న బలంతో రాజ్యసభ సభ్యత్వం దక్కడం కష్టమే అందుకు కూటమి పార్టీల మద్దతు కూడా అవసరం అవుతుంది. నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం కల్పించే విషయంలో ఇప్పటికే టీడీపీతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో నాగబాబు అభ్యర్థిత్వం కూడా ఢిల్లీ పర్యటనలో భాగమని తెలుస్తోంది.
గత రెండు రోజులుగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మకాం వేశారు. కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక దానిని జనసేనకు కేటాయించాలని బీజేపీ బాధ్యులను కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దల వద్ద నాగబాబు అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఖాళీ అయిన మూడుస్థానాల్లో ఒకదానిని పవన్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరును ప్రతిపాదించినట్టు సమాచారం.
నాగబాబు ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా ఎన్నికల పొత్తులో ఆ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే రాజ్యసభ హామీ ఇచ్చినట్టు పార్టీలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో వాటిలో నాగబాబును రాజ్య సభకు పంపించాలని యోచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల క్రితం షెడ్యూల్ విడుదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. రాజీనామాలను ఆమోదించడంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టింది. ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల ఖాళీలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
రాజ్యసభ ఉప ఎన్నికలకు డిసెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు డిసెంబరు 10 వరకు ఉంది. డిసెంబరు 11న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబరు 13 తుది గడువు అని షెడ్యూల్‌లో ఈసీ పేర్కొంది. డిసెంబరు 20వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మోపిదేవి వెంటరమణ పదవీ కాలం 2026 జూన్ 21 వరకు ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యల పదవీ కాలం 2028 జూన్ 21 వరకు ఉంది. ఏడాన్నర పదవీకాలం ఉండగానే మోపిదేవి పదవికి రాజీనామా చేశారు. తిరిగి రాజ్యసభకు వెళ్లే యోచన లేదని స్పష్టం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజ్యసభకు పంపారని, మండలిలో అవకాశం వస్తుందని భావిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారుర.
మూడున్నరేళ్ల పాటు పదవీకాలం ఉంటుండగానే బీద మస్తాన్ రావు, తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యలు రాజీనామా చేశారు. కృష్ణయ్యకు మరోసారి ఏపీ నుంచి ప్రాతినిథ్యం దక్కకపోవచ్చు. 2028 వరకు పదవీ కాలం ఉన్న స్థానాల్లో ఒకదానికి నాగబాబుకు అవకాశం దక్కొచ్చు. ఏపీలో 175 స్థానాలో 164 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి సొంత చేసుకుంది. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు టీడీపీ కూటమికే వస్తాయి.
నాగబాబు రాజ్యసభకు వెళితే చిరంజీవిత తర్వాత ఒకే కుటుంబం నుంచి ఆ పదవి దక్కించుకున్న రికార్డు దక్కుతుంది. అదృష్టం కలిసొస్తే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలో కూడా చోటు దక్కించుకోవచ్చు.