Anantapur Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు వైద్యులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మృతి చెందారు. వీరంతా బళ్లారికి చెందినవారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
అనంతపురం జిల్లా విడపనకల్లులో 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. చికిత్స కోసం బళ్లారికి తరలించారు. మృతులను బళ్లారికి చెందిన ప్రభుత్వ వైద్యులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు అయిపోయింది.ప్రమాద దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో చనిపోయినవారిని బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ గుర్తించారు. వీరంతా విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.
ఇటీవలే 8 మంది మృతి..
వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదస్థలిలోనే ఇద్దరు మృతి చెందగా, మార్గమధ్యలో మరో ఇద్దరు, ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘటన మరవకముందే తాజాగా ముగ్గురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఉదయం వేళ మంచు కురిసే వేళలో ప్రయాణాలు చేయకపోవటం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. హైవేలపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
విజయనగరంలో ఘోర ప్రమాదం:
శనివారం విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం భోగాపురం మండలం పోలిపల్లి వద్ద చోటుచేసుకుంది.
కారు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన కారు… డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడకిక్కడే చనిపోయారు. మరోవైపు లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.