Parenting Tips: పిల్లలు మీ మాట వినడం లేదా? కారణాలు ఇవే అయిండొచ్చు.. తల్లిదండ్రులూ సరిదిద్దుకోండి!-why kids may not listen to parents know the five main reasons and rectify those ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లలు మీ మాట వినడం లేదా? కారణాలు ఇవే అయిండొచ్చు.. తల్లిదండ్రులూ సరిదిద్దుకోండి!

Parenting Tips: పిల్లలు మీ మాట వినడం లేదా? కారణాలు ఇవే అయిండొచ్చు.. తల్లిదండ్రులూ సరిదిద్దుకోండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 02, 2024 02:00 PM IST

Parenting Tips: కొందరు పిల్లలు.. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినరు. వారు చెప్పే విషయాలను ఫాలో కాకుండా మొండిగా తయారు అవుతారు. అయితే, తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు కూడా ఇందుకు కారణాలు అవొచ్చు.

Parenting Tips: పిల్లలు మీ మాట వినడం లేదా? కారణాలు ఇవే అయిండొచ్చు.. తల్లిదండ్రులూ సరిదిద్దుకోండి!
Parenting Tips: పిల్లలు మీ మాట వినడం లేదా? కారణాలు ఇవే అయిండొచ్చు.. తల్లిదండ్రులూ సరిదిద్దుకోండి!

“పిల్లలు మా మాట సరిగా వినడం లేదు. చెప్పిననట్టు నడుచుకోడం లేదు” ఇటీవలి కాలంలో చాలా మంది తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న మాటలు ఇవి. పిల్లలు ఎలా ఎందుకు ఉంటున్నారో కూడా అర్థం చేసుకోవడం వారికి కష్టంగా ఉంటోంది. ఎందుకంటే చిన్నపిల్లలు వారి భావాలను అంత స్పష్టంగా వ్యక్తం చేయరు. అయితే, పిల్లలు సరిగా మాట వినకపోవడానికి తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావొచ్చు. తెలిసో తెలియకో కొందరు ఈ తప్పులు చేస్తుంటారు. దీంతో కొంతకాలానికి పిల్లలు మాట వినకుండా మొండిగా తయారు అవుతారు. అందుకు కారణవుతున్న తల్లిదండ్రులు చేస్తున్న ప్రధానమైన పొరపాట్లు ఇవే..

పట్టించుకోకపోవడం

తమకు అవసరమైనప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, అవసరాలను తీర్చకపోతే పిల్లలు బాధపడతారు. ఇలా జరుగుతూ పోతే కొంతకాలానికి తల్లిదండ్రులను పిల్లలు కూడా పట్టించుకోవడం మానేసే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు వారి పనుల్లో ఎక్కువగా మునిగిపోవడం, ఫోన్లలో ఎక్కువసేపు గడుపుతూ ఒక్కోసారి పిల్లలను పట్టించుకోరు. వారికి సమయం కేటాయించరు. దీనివల్ల పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలపై పేరెంట్స్ నిరంతరం దృష్టి సారిస్తూ.. సమయం కేటాయిస్తూ ఉండాలి.

ఎక్కువగా కంట్రోల్ చేయాలనుకోవడం

కొందరు తల్లిదండ్రులు.. పిల్లలపై అవసరానికి మించి అతిగా ఆంక్షలు పెడుతూ కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. బలవంంతగా నియంత్రిస్తుంటారు. ఇలాగే చేస్తుంటే కొంతకాలానికి పిల్లలు ఎదురిస్తూ మొండిగా మారే అవకాశం ఉంటుంది. మాటల వినకుండా ఉంటారు. అందుకే ఏవైనా ఆంక్షలు పెట్టాల్సి వస్తే.. ఎందుకో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏ పని ఎందుకు చేయాలో వారికి నిదానంగా చెబితే అర్థం చేసుకుంటారు.

ఆలోచించకుండా వద్దనడం

పిల్లలు ఏదైనా చెప్పినా.. ఏదైనా అడిగినా కొందరు తల్లిదండ్రులు టక్కున వద్దనేస్తారు. కనీసం దాని గురించి కూడా ఆలోచించేందుకు ఇష్టపడరు. అలాగే చాలాసార్లు అయితే దీనివల్ల పిల్లలు నొచ్చుకుంటారు. వారు కూడా పేరెంట్స్ మాటను తిరస్కరించే అవకాశాలు పెరుగుతాయి. అందుకే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు.. అది నిజంగా అవసరమా.. కాదా అని తల్లిదండ్రులు ఆలోచించాలి. ఒకవేళ సరైనది కాకపోతే.. ఎందుకో పిల్లలకు వివరించాలి. అర్థమయ్యేట్టు సర్దిచెప్పాలి.

ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం

చాలా మంది తల్లిదండ్రులు.. ఎక్కువగా చేసే పొరపాటు ఇతరులతో తమ పిల్లలను పోల్చడం. ఇలా పోల్చుతూ పోతే పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆత్మనూన్యత పెరుగుతుంది. దీనివల్ల కూడా కొంతకాలానికి పిల్లల్లో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే పిల్లలను ఇతరులతో పోల్చి తిట్టకుండా.. కావాల్సి వస్తే వారి నుంచి స్ఫూర్తి ఎలా పొందాలో.. ఏ పద్ధతులు పాటించాలో చెప్పాలి. ఎవరి కంటే తక్కువ కాదనే ధైర్యాన్ని ఇవ్వాలి.

అతి క్రమశిక్షణ

పిల్లలకు క్రమశిక్షణ అలవరచడం చాలా ముఖ్యం. ఇది వారికి చాలా మేలు చేస్తుంది. అయితే, కొందరు తల్లిదండ్రులు.. పిల్లలకు బలవంతంగా అవసరానికి మించి క్రమశిక్షణను పాటించాలని చెబుతుంటారు. అన్ని విషయాల్లో కఠినంగా ఉంటారు. దీనివల్ల పిల్లలు బాధపడతారు. ఇది ఎక్కువైతే పిల్లలు.. మాట వినే అవకాశం తగ్గుతుంది. అందుకే పిల్లలను క్రమశిక్షణతో పెంచినా.. కొన్ని విషయాల్లో స్వేచ్ఛను ఇవ్వాలి. వారి అభిప్రాయాలు అడగాలి.

Whats_app_banner

సంబంధిత కథనం