Parenting Tips: నిద్రపోయే ముందు పిల్లలకు కచ్చితంగా కథలు చెప్పండి.. ఎన్ని లాభాలో తెలుసా?
Parenting Tips: ఇటీవలి కాలంలో పిల్లలకు తల్లిదండ్రులు కథలు చెప్పడమే తగ్గిపోయింది. అయితే, చిన్నారులకు స్టోరీలు చెబితే చాలా రకాలుగా వారి ఎదుగుదలకు ఇవి తోడ్పడతాయి. ఆ లాభాలు ఏవో ఇక్కడ చూడండి.
ఒకప్పుడు చిన్నపిల్లలకు తల్లిదండ్రులో, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలో కథలు చెప్పేవారు. చిన్నతనం నుంచి వారికి విభిన్న రకాలైన కథలు వినిపించేవారు. అనగనగా అంటూ నీతి కథల నుంచి ఇతిహాసాలు, పురాణాల గురించి వివరించే వారు. రాత్రి వేళ కథలు వింటూ చిన్నారులు నిద్రించేవారు. అయితే, కొన్నేళ్లుగా హడావుడి ప్రపంచంలో ఇది బాగా తగ్గిపోయింది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోవడంతో పిల్లలకు కథలు చెప్పే విషయం బాగా తగ్గిపోయింది. అయితే, పిల్లలకు నిద్రపోయే ముందు కథలు చెబితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. వారు అన్ని విధాలుగా మెరుగయ్యేందుకు తోడ్పడుతుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విలువలు, మంచితనం పెరుగుతాయి
పిల్లలకు కథలు వినిపించడం వల్ల వారిలో చిన్నతనంలోనే విలువలు పెరుగుతాయి. కథల్లోని మంచిని వారు బలంగా మెదడులో నిలుపుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. వారి మంచిదనం, దయాగుణం పెరుగుతాయి. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అధికం అవుతుంది.
బంధం బలపడుతుంది
ఇటీవలి కాలంలో ఉద్యోగాలు, పనుల్లో బిజీగా ఉంటూ కొందరు తల్లిదండ్రులు.. పిల్లలకు సమయాన్ని సరిగా కేటాయించలేకపోతున్నారు. దీంతో పిల్లలతో తల్లిదండ్రుల బంధం ఎమోషనల్‍గా అంత బలంగా ఉండడం లేదు. అయితే, కథలు చెప్పడం వల్ల మీరు వారితో ఆ సమయం పూర్తిగా గడిపినట్టు అవుతుంది. వారిపైనే మీరు దృష్టి పెట్టినట్టు పిల్లలు భావిస్తారు. దీంతో బంధం మరింత బలోపేతం అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్ మరింత అధికమవుతుంది.
ఇమాజినేషన్, సృజనాత్మకత పెరుగుతాయి
పిల్లలకు చెప్పే కథల్లో ఎక్కువగా ఫ్యాంటసీలు ఉంటాయి. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, వివిధ పరిస్థితులతో కథలు ఉంటాయి. దీంతో అవి చెప్పే సమయంలో వారు ఆ ప్రాంతాలను, వ్యక్తులను, పరిస్థితులను పిల్లలు ఊహించుకుంటారు. దీని వల్ల వారి ఇమాజినేషన్ శక్తి పెరుగుతుంది. అలాగే వారి సృజనాత్మకత కూడా పెరుగుతుంది. జీవితంలో ఎదిగేందుకు ఈ అంశాలు వారికి చాలా దోహదం చేస్తాయి.
కొత్త పదాలు, భాషపై పట్టు
కథల వల్ల పిల్లలకు ఎప్పటిప్పుడు కొత్త పదాలు తెలుస్తాయి. కథల్లో తరచూ పిల్లలకు తెలియని పదాలు వస్తుంటాయి. ఆ సమయంలో వారు పెద్దలను అడిగి అదేంటో తెలుసుకుంటారు. దీనివల్ల వారు కొత్త పదాలు నేర్చుకుంటారు. అలాగే కథల వల్ల భాషపై పిల్లలకు పట్టు పెరుగుతుంది. భాషను సులువుగా నేర్చుకుంటారు. ఇది చదువుకు కూడా ఎంతో తోడ్పడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది
కథలను పిల్లలు పూర్తి ఏకాగ్రతతో వింటారు. దృష్టి అంతా కేంద్రీకరిస్తారు. దీంతో ఒకవేళ వారిలో ఒత్తిడి ఉన్నా తగ్గుతుంది. రిలాక్స్ అవుతారు. నిద్రపట్టేందుకు కూడా కథలు చెప్పడం ఉపయోగపడుతుంది. పిల్లలతో సమయం గడపటం వల్ల పెద్దలకు ఒత్తిడి తగ్గుతుంది.