Geyser Buying Tips: ఈ చలికాలంలో గీజర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలను తప్పక పరిశీలించాలి
Geyser Buying Tips: చలికాలంలో వేడి నీటి కోసం చాలా మంది గీజర్లు కొనాలని చూస్తుంటారు. అయితే, వీటిని తీసుకునే ముందు కచ్చితంగా కొన్ని విషయాలను పరిశీలించాలి. సరైనది తీసుకోకపోతే ఇబ్బందిగా ఉంటుంది. గీజర్ తీసుకునే ముందు పరిశీలించాల్సిన విషయాలు ఏవో ఇక్కడ చూడండి.
దాదాపు చలికాలం అడుగుపెట్టేసింది. చల్లటి వాతావరణం తీవ్రంగా ఉండే ఈ కాలంలో వేడి నీటి కోసం గీజర్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆలోచిస్తుంటారు. స్నానం కోసం హాట్ వాటర్ కావాలంటే గీజర్ బెస్ట్ ఆప్షన్‍గా ఉంది. వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే, గీజర్ కొనే వారు ముందుగా కొన్ని విషయాలను తప్పకుండా పరిశీలించాలి. ఎంపిక విషయంలో పొరపాటు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. గీజర్ కొనే ముందు పరిశీలించాల్సిన విషయాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
సరైన కెపాసిటీ
ఇంటి కోసం ప్రతీ రోజు ఎంత వేడినీరు అవసరం అవుతుందని ముందుగా కచ్చితంగా అంచనాతో లెక్క వేసుకోవాలి. అందుకు తగ్గట్టు కెపాసిటీ ఉన్న గీజర్ ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ చిన్నది తీసుకుంటే నీరు సరిపోక.. సమయం వృథా అయి ప్రతీ రోజు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఎంత మంది ఉన్నారు.. ఎంత వాడే అవకాశం ఉందో తెలుసుకోవాలి. సాధారణంగా కుటుంబానికి 10 లీటర్ల నుంచి 25 లీటర్ల మధ్య కెపాసిటీ ఉండే గీజర్ సరిపోతుంది. ఒకరో.. ఇద్దరో ఉంటే అంత కంటే తక్కువ తీసుకోవచ్చు. కిచెన్ కోసం కూడా చిన్నది అయినా సరిపోతుంది.
ఎనర్జీ రేటింగ్
గీజర్ తీసుకునే సమయంలో ఎనర్జీ రేటింగ్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఒకవేళ రేటింగ్ తక్కువగా ఉంటే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కరెంట్ బిల్‍పై ఎక్కువగా పెరగొచ్చు. అందుకే 5 స్టార్ లేకపోతే 4 స్టార్ బీఈఈ ఎనర్జీ రేటింగ్ ఉన్న గీజర్లు కొనడం ఉత్తమం. 4 కంటే తక్కువ రేటింగ్ ఉండే కాస్త ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది.
సెఫ్టీ ఫీచర్లు
చాలా మంది గీజర్ కొనే సమయంలో సెఫ్టీ ఫీచర్లను పెద్దగా పట్టింకోరు. అయితే, గీజర్ వాడే సమయంలో ఎలాంటి ప్రమాదం జరగుకుండా ఉండాలంటే కోసం ఇవి కూడా చాలా ముఖ్యం. ఓవర్ హీటింగ్ అవకుండా థెర్మోస్టార్ట్ ఫీచర్ ఉండాలి. ప్రెజర్ రివీఫ్ వాల్వ్స్, థర్మల్ కట్స్ లాంటి సెఫ్టీ ఫీచర్లు కూడా ఉంటే మేలు. సెఫ్టీ ఫీచర్ల గురించి బాగా పరిశీలించాలి.
సరైన టైప్
గీజర్లలో స్టోరేజ్, ఇన్‍స్టంట్ అంటూ రెండు టైప్స్ ఉంటాయి. వీటి గురించి తెలియకుండా తీసుకుంటే వాడడం కష్టమవుతుంది. కుటుంబంలో ఎక్కువ మంది.. ఎక్కువ వేడి నీటిని వాడాలనుకుంటే స్టోరేజ్ గీజర్లను తీసుకోవాలి. ఒకవేళ వాడకం తక్కువగానే ఉంటే ఇన్‍స్టంట్ గీజర్ తీసుకోవచ్చు. మీరు వాడకాన్ని బట్టి సరైన టైప్ గీజర్ తీసుకోవడం చాలా ముఖ్యం.