Sabudana Pakodi: క్రిస్పీగా సగ్గుబియ్యం పకోడీలు ఇలా చేశారంటే అదిరిపోతాయి, రెసిపీ తెలుసుకోండి
Sabudana Pakodi: సగ్గుబియ్యంతో చేసే ఆహారాలు టేస్టీగా ఉంటాయి. కానీ వీటితో ఉండే వారి సంఖ్య తక్కువే. నిజానికి సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
సాయంత్రం అయితే చాలు చలికాలంలో పకోడీలు తినాలన్న కోరిక పెరిగిపోతుంది. ఇప్పుడు శనగపిండితో చేసే పకోడీలే కాదు ఆరోగ్యంగా సగ్గుబియ్యంతో చేసిన పకోడీలు కూడా వండుకొని తినండి. ఇవి టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఒక్కసారి సగ్గుబియ్యం పకోడీలు ఎలా చేయాలో తెలుసుకోండి. ఇది మీకు నచ్చడం ఖాయం.
సగ్గుబియ్యం పకోడీలు రెసిపీకి కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం - అరకప్పు
బంగాళదుంపలు - రెండు
వేరుశనగ పలుకులు - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
కొత్తిమీర తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
సగ్గుబియ్యం పకోడీ రెసిపీ
1. సగ్గుబియ్యం పకోడీ చేయడానికి ముందుగా సగ్గుబియ్యాన్ని నాన పెట్టాల్సిన అవసరం లేదు.
2. సగ్గుబియ్యం గింజలను మిక్సీలో వేసి మెత్తటి పొడి లాగా చేసుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంపలను నీళ్లను వేసి బాగా ఉడకబెట్టి పైన పొట్టు తీసేయండి.
4. మరొక గిన్నెలో ఈ బంగాళదుంపలను వేసి చేతితోనే మెత్తగా మెదుపుకోండి.
5. అందులోనే ముందుగా పొడిచేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడిని కూడా వేసుకోండి.
6. వేరుశెనగ పలుకులను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకొని వాటిని కూడా వేయండి.
7. అలాగే పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలపండి.
8. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపండి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని పక్కన పెట్టండి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.
11. ఆ నూనెలో ఈ మిశ్రమంతో చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోండి.
12. వీటి రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
13. అంతే టేస్టీ సగ్గుబియ్యం పకోడీ రెడీ అయినట్టే.
వీటిని తింటే ఇంకా తినాలనిపిస్తుంది క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. సాయంత్రం పూట వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది. పుదీనా చట్నీలో ఇవి ముంచుకుని తింటే ఆ రుచే వేరు.
శెనగపిండితో చేసే పకోడీలు బోర్ కొడితే ఒకసారి సగ్గుబియ్యంతో పకోడీలు చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతాయి. వీటిని చేయడం కూడా చాలా సులువు. సగ్గుబియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. బంగాళాదుంపల్ని ఉడకబెడితే చాలు, ఒక్కసారి ఇవి చేసుకుంటే మీకు ఎంతో నచ్చుతాయి.
టాపిక్