Yoga Poses: తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారా? ఈ యోగాసనాలతో ఉపశమనం
Yoga Poses for stress relief: ఒత్తిడి చాలా మందిలో సమస్యగా ఉంది. అయితే, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనసు ప్రశాంతం ఉండేందుకు ఈ ఆసనాలు ఉపకరిస్తాయి.
ప్రస్తుతం ఉన్న బిజీ జీవితాల్లో ఒత్తిడి చాలా మందిని వేధిస్తోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే, కొన్ని రకాల యోగాసనాలు చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగానూ చాలా మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు ఏవో ఇక్కడ చూడండి.
బాలాసనం
బాలాసనం వేయడం వల్ల శరీరమంతా ప్రశాంతంగా, రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. శ్వాసను గట్టిగా తీసుకోవడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. ఉదయాన్నే ఈ ఆసనం వేస్తే రోజంతా రిఫ్రెషింగ్‍గా అనిపిస్తుంది. నాడీ వ్యవస్థకు, నడుముకు మేలు జరుగుతుంది.
ఎలా వేయాలి: ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత చేతులను చాపి ముందుకు వంగాలి. చేతులను, తలను ముందుకు వంగి నేలకు అనించాలి. పిల్లలు బోర్లా పడుకున్నట్టుగా ఈ ఆసనం ఉంటుంది. దీన్ని శశాంకాసనం అని కూడా పిలుస్తారు.
అదో ముఖ స్వనాసనం
అదో ముఖ స్వనాసనం వేయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గేందుకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఏకాగ్రత కూడా పెంచుతుంది.
ఎలా వేయాలి: ముందుగా నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత అరికాళ్లపై బరువు వేస్తూ ముందుకు వంగాలి. రెండు చేతులను నేలకు ఆనించాలి. మొత్తంగా శరీరం రివర్స్ వీ షేప్‍లో ఉండాలి. ఇలా 5 నుంచి 10 బ్రీత్స్ వరకు ఉండాలి.
శవాసనం
శవాసనంలో ముఖ్యంగా శ్వాసపై ఎక్కువగా ధ్యాస ఉంచాలి. శ్వాసను గట్టిగా తీసుకొని వదలాలి. దీనివల్ల శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాడు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎలా వేయాలి: శవాసనం చాలా సులువు. వెల్లకిలా పడుకోవాలి. శరీరంలో ఎలాంటి కదలికలు ఉండకూడదు. శ్వాసమీద పూర్తి ధ్యాస ఉంచాలి. ఈ ఆసనం వల్ల అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
మర్జర్యాసనం - బిటిలాసనం
మానసిక ఒత్తిడిని ఈ మర్జర్యాసనం - బిటిలాసనం తగ్గించగలదు. ప్రశాంతతను పెంచి మైండ్‍ఫుల్‍నెస్‍ను పెంపొదిస్తుంది. నడుము దృఢత్వం పెరిగేందుకు కూడా ఈ ఆసనం తోడ్పడుతుంది.
ఎలా వేయాలి: ముందుగా చేతులు, మోకాళ్లు నేలకు ఆనించాలి. పిల్లిలా ఆసనం వేయాలి. అందుకే ఈ ఆసనాన్ని పిల్లి-ఆవు ఆసనం అని కూడా పిలుస్తారు. శ్వాస తీసుకోవడం, వదలడాన్ని బట్టి వీపును పైకి ఉంచడం, బిగించడం చేయాలి.
ధ్యానం (మెడిటేషన్)
ధ్యానం కూడా యోగాలో భాగమే. ధ్యానం చేయడం వల్ల మెదడు, శరీరంలో చాలా ప్రశాంతంగా అవుతాయి. ఒత్తిడి తగ్గేందుకు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ధ్యానం ఎంతో మేలు చేస్తుంది.
ఎలా చేయాలి: ముందుగా చాలా సౌకర్యవంతంగా కూర్చోవాలి. కళ్లు మూసుకొని శ్వాసమీద పూర్తి ఏకాగ్రత పెట్టాలి. ఉచ్వాస, నిశ్వాసపైనే ఫోకస్ ఉండాలి. ముందుగా కొన్ని రోజులు కాసేపు ధ్యానం చేసి.. ఆ తర్వాత సమయాన్ని పెంచవచ్చు. ప్రతీ రోజు కనీసం 20 నిమిషాలు ధ్యానం చేస్తే మంచిది.