Saturday Motivation: అతి ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, వాటిని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది-overthinking can damage your health so you need to stop them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: అతి ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, వాటిని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది

Saturday Motivation: అతి ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, వాటిని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది

Haritha Chappa HT Telugu
Nov 23, 2024 05:30 AM IST

Saturday Motivation: ఆలోచనలు అతిగా ఉంటే మీరు కూడా అధికంగా రియాక్ట్ అవుతారు. ఆలోచనలను ఎంత తగ్గించుకుంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. అతి ఆలోచనలు మిమ్మల్ని అందరి నుంచి దూరం చేస్తాయి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (pixabay)

మన ఆలోచనల రూపమే మన జీవితం. మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే... జీవితం పాజిటివ్ గానే సాగుతుంది. అదే నెగిటివ్ థింకింగ్ ఎక్కువైతే అన్నీ ఇబ్బందులూ, కష్టాల్లాగే కనిపిస్తాయి. అలాగే అతిగా ఆలోచించడం కూడా మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. సమాజం నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టి వేసినట్టు అనిపిస్తుంది. చివరికి మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇది ఎన్నో మానసిక సమస్యలకు కారణమవుతుంది. మానసిక సమస్యలు ఎన్నో శారీరక సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి అతిగా ఆలోచించడం అనేది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

ప్రతి ఒక్కరికీ ఆలోచనలు ఉంటాయి. అయితే కొందరు చాలా తక్కువగా ఆలోచిస్తారు. మరికొందరు ఎంత కావాలో అంతే ఆలోచిస్తారు. ఇక మూడో రకం అతిగా ఆలోచించడం. కూర్చుని తమలో తామే ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇది వారి భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. చుట్టూ ఎంతో మంది ఉన్నా కూడా తమ ఒంటరిగా ఉన్నామని వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వారి మానసిక ప్రవర్తన పై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఒంటరితనం చుట్టుముట్టేస్తుంది. దీనివల్ల తీవ్ర ఒత్తిడి పాలవుతారు. చివరికి మానసిక సమస్యల బారిన పడతారు.

మీరు దేని గురించి అయినా అవసరానికి మించి ఆలోచించకండి. మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల జరగబోయేది మారదు, జరిగింది మార్చలేరు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మీరు అతిఆలోచనలు మానేసి... ఏం జరిగితే జరుగుతుందని తెగించి ఉండాలి. లేకుంటే మీరు ఒంటరి వారై పోతారు. మానసికంగా కుంగిపోతారు. మీలో నెగిటివిటీ పెరిగిపోతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల జీవితమంతా సమస్యల్లా కనిపిస్తుంది.

అతి ఆలోచనలు కేవలం మానసిక ఆరోగ్యానికి కాదు, శారీరక ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఆలోచనల కారణంగా మానసిక వేదన బారిన పడి... నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. ఆ నిద్రలేని వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు, హైబీపీ పేషెంట్లు ప్రతిరోజూ ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్ర పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతి ఆలోచనలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే బిజీ చేసుకోండి. మీకు ఇష్టమైన పనిలో నిమగ్నం అవ్వండి.

అతి ఆలోచనలు వేధిస్తున్నప్పుడు ఏదైనా సినిమా చూడండి. లేదా కొత్త వంటలు ప్రయత్నించండి. పెయింటింగ్ వేయండి. అలసట కలిగేలా డాన్స్ చేయండి. ఏదైనా మీకు ఇష్టమైన పని చేస్తూ ఉండండి. ఇది మీలో ఒంటరితనం అనే ఫీలింగ్ ను రానివ్వదు. అలాగే అది ఆలోచనలను కూడా తగ్గిస్తుంది.

మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు ఎలా ఉన్నారు అన్నది మీ ఆలోచనల వల్ల కలిగినదే. కాబట్టి మీ జీవితం సమస్యల మయంగా అనిపిస్తే అది మీరు చేసుకున్నదే అనుకోవాలి. అదే ప్రశాంతంగా అనిపిస్తే మీ పాజిటివ్ థింకింగ్ వల్లే ఆ ఫలితం దక్కిందని అర్థం చేసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు అతి ఆలోచనలు మానేయాలి.

Whats_app_banner