Konaseema News : కోనసీమ జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు, చిన్నారులపై లైంగిక వేధింపులు
Konaseema News : కోనసీమ జిల్లాలో దారుణం జరిగింగి. ఓ ప్రభుత్వ పాఠశాలలో 3,4 తరగతుల విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులు ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా ఈ వేధింపులు సాగిస్తున్నాడు. లైంగిక వేధింపుల గురించి చెప్పలేక విద్యార్థినులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ విషయం బయటపడటంతో ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్తు పాఠశాలలో చోటుచేసుకుంది. 1998లో డీఎస్సీ క్వాలిఫై అయిన పిండి శ్రీనివాస్‌కు మూడేళ్ల క్రితం మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. 2023 జూన్ 26న పి.గన్నవరం మండలంలోని ప్రస్తుతం పని చేసే ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. పాఠశాలలోని 4, 5 తరగతుల విద్యార్థినులను మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
కానీ ఆ చిన్నారులు ఎవరికి చెప్పలేక, మనసులో బాధపడుతున్నారు. అయితే తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. తల్లిదండ్రులు, స్థానికులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, డీఈవో సలీంబాషా దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవోలు కోన హెలీనా, చింతా వీరభద్రానందం పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. మంగళవారం కోన హెలీనా పాఠశాలకు విచారణకు వెళ్లి విద్యార్థినులతో విడిగా మాట్లాడారు. విద్యార్థినులు వణికిపోతూ వేధింపుల గురించి చెప్పలేక కన్నీరుమున్నీరు అయ్యారు.
అయితే గుడ్‌టచ్-బ్యాడ్‌టచ్ గురించి ఓ టీచర్ చెప్పడంతో విద్యార్థినులకు అవగాహన వచ్చింది. తమ పట్ల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ వ్యవహరించిన తీరును విద్యార్థినులు ఎంఈవో హెలీనాకు వివరించారు. సోమవారం సాయంత్రం కూడా ఒక విద్యార్థినిని కౌగిలించుకున్నాడని విద్యార్థినులంతా చెప్పారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఎస్ఐ చిరంజీవి, పోలీసు సిబ్బంది పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యాయుడికి తగిన శిక్ష విధించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
పోక్స్ కేసులో ఉపాధ్యాయుడు అరెస్టు
రాజమండ్రి రూరల్ మండలంలోని ఒక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో బాలికపై లైంగిక చర్యలకు పాల్పిడిన హిందీ స్కూల్ అసిస్టెంట్ తంగేటి సత్యనారాయణమూర్తిపై పోక్సో కేసు నమోదు అయింది. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఉత్తర్వుల మేరకు సౌత్‌జోన్ డీఎస్పీ డి.భవ్య కిశోర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ గణేష్, ఎస్ఐ హరిబాబు సమగ్ర దర్యాప్తు చేశారు. ఉపాధ్యాయుడు సత్యనారాయణమూర్తిని మంగళవారం పోక్సో కేసులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.
హిందీ స్కూల్ అసిస్టెంట్ సత్యనారాయణమూర్తిని సస్పెండ్ చేస్తూ రంపచోడవరం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విజయశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. దేవీపట్నం మండలం కొత్తవీధిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించిన మూర్తి, పక్షవాతం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు డిప్యుటేషన్‌పై వెళ్లాడు. ఇటీవలి విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి, ఐసీడీఎస్ సీడీపీవో విచారణలో వాస్తవమని తేలింది. దీంతో మూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం