Sexual assault in parliament: పార్లమెంట్లోనే లైంగిక వేధింపులకు గురయ్యా’’: మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిదియా థోర్పె (Lidia Thorpe) సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటు భవనంలోనే తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు. మహిళలకు ఈ పార్లమెంటు సురక్షితం కాదని వాపోయారు.
ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిదియా థోర్పె (Lidia Thorpe) సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంటు భవనంలోనే తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు. మహిళలకు ఈ పార్లమెంటు సురక్షితం కాదని వాపోయారు. సహ సెనెటర్ అయిన ఒక పవర్ ఫుల్ వ్యక్తి పార్లమెంటు భవనంలోని మెట్లపై తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
కన్నీళ్లతో ప్రసంగం..
ఆస్ట్రేలియాలో ఇండిపెండెంట్ సెనెటర్ అయిన మహిళ లిదియా థోర్పె (Lidia Thorpe) తన బాధాకర అనుభవాన్ని బుధవారం సెనెట్ సాక్షిగా కన్నీళ్లతో వివరించారు. లిబరల్ పార్టీకి చెందిన సహ సెనెటర్ డేవిడ్ వాన్ (David Van) తనను చాన్నాళ్లుగా సెక్సువల్ గా వేధిస్తున్నాడని, ఒక రోజు పార్లమెంటు భవనంలోని మెట్ల మార్గంలో తనను అడ్డగించి, గోడవైపు నెట్టి, తనను అభ్యంతరకర రీతిలో పట్టుకున్నాడని, అసభ్య మాటలతో బాధపెట్టాడని ఆమె సెనెట్ కు వివరించారు. బలవంతంగా లైంగిక చర్యకు ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేశారు. అతడు చాలా పవర్ ఫుల్ వ్యక్తి అని వివరించారు. పార్లమెంటు భవనంలో తమ ఇద్దరి ఆఫీస్ లు దగ్గర, దగ్గరగా ఉన్న సమయంలో తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లడానికి కూడా భయపడేదానినని, డోర్ కొద్దిగా తెరిచి చూసి, అక్కడ డేవిడ్ వాన్ లేడని నిర్ధారించుకున్న తరువాతనే బయటకు వెళ్లేదాన్నని కన్నీళ్లతో వివరించారు. లేదంటే, ఎవరో ఒకరిని తోడుగా తీసుకువెళ్లేదాన్నని తెలిపారు. మహిళలకు ఆస్ట్రేలియా పార్లమెంటు సురక్షితంగా లేదని వ్యాఖ్యానించారు. తనలాంటి దారుణ అనుభవం మరికొందరు మహిళలకు కూడా ఎదురై ఉండవచ్చని, కానీ భయంతో వారు బయటకు చెప్పడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం సెనెట్ లో ఆమె ఇవే ఆరోపణలు చేయగా, బలవంతంగా ఆమెతో ఈ ఆరోపణలను ఉపసంహరించుకునేలా చేశారు. మళ్లీ బుధవారం ఆమె అవే ఆరోపణలను మరింత బలంగా వినిపించడం విశేషం.
తప్పుడు ఆరోపణలు..
ఇండిపెండెంట్ సెనెటర్ లిదియా థోర్పె (Lidia Thorpe) చేసిన ఈ ఆరోపణలనుసెనెటర్ డేవిడ్ వాన్ తీవ్రంగా ఖండించారు. దురుద్దేశంతో, తన ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఆమె ఈ ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. చేతులు వణుకుతుండగా, తన ప్రకటనను ఆయన సెనెట్ లో చదివి వినిపించారు. తప్పుడు ఆరోపణలతో ఆస్ట్రేలియా సెనెట్ పరువు తీశారని సెనెటర్ లిదియా థోర్పె (Lidia Thorpe) ను విమర్శించారు. లిదియా థోర్పె ఆరోపణలు వెలుగులోకి రాగానే డేవిడ్ వాన్ ను లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది.