Teacher Death: క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల ఘర్షణ, అడ్డుకున్న ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి, దాడి చేశారని ఆరోపణలు
Teacher Death: అన్నమయ్య జిల్లా రాయచోటిలో తరగతి గదిలో గొడవ పడుతున్న విద్యార్థుల్ని మందలించిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యార్ధులు దాడి చేయడంతోనే ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కలకలం రేపాయి. కేసును తప్పదోవ పట్టిస్తున్నారని మృతుడి భార్య ఆరోపించారు.
Teacher Death: పాఠశాలలో ఘర్షణ పడుతున్న విద్యార్ధుల్ని మందలించిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తరగతి గదిలో అల్లరి చేస్తున్న 9వ తరగతి విద్యార్ధులపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎదురుతిరిగిన విద్యార్థులు ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనలో తరగతి గదిలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థుల దాడిలోనే చనిపోయారని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏజాజ్ అహ్మద్ (42) కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఉర్దూ హై స్కూల్‌లో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం పాఠశాలలో ఏజాజ్ పాఠం చెబు తున్న సమయంలో పక్కనున్న తొమ్మిదో తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండటంతో అక్కడికి వెళ్లారు. క్లాస్ రూమ్‌లో కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు గుర్తించి వారిని గట్టిగా మందలించారు.
ఈ క్రమంలో విద్యార్ధులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులు సర్ది చెప్పి స్టాఫ్ రూమ్‌కు తీసుకొచ్చారు. అక్కడ అలసటగా ఉందని చెప్పడంతో సహచరులు టాబ్లెట్ ఇచ్చారు. కాసేపటికే కుప్పకూలిపోవడంతో వెంటనే సహచర ఉపాధ్యాయులు రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఉపాధ్యాయుడు ఎజాజ్ ఆస్పత్రికి వెళ్లే సరికి ప్రాణాలు కోల్పోయారని ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాయచోటి బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మృతుడి భార్యకు సమాచారం ఇచ్చిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తరలించారు. . గుండెపోటుతో చనిపోయినట్టు తొలుత సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత తరగతి గదిలో జరిగిన పరిణామాలు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థులు దాడి చేయడంతో ఎజాజ్ ప్రాణాలు కోల్పోయారని బాధితురాలు వాపోయారు. గొడవ పడుతు న్న విద్యార్థులను మందలించినందుకు విద్యార్ధులు దాడి చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులు ఎదురుతిరగడంతో ఉపాధ్యాయుడు బీపీ పెరిగినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. తన భర్తకు ఎలాంటి అనారోగ్యం లేదని, ప్రతి రోజు పాఠశాలకు వెళ్తారని, వ్యక్తిగత విభేదాలతో సహచరులు విద్యార్థులతో దాడి చేయించారని మృతుడి భార్య రహిమూన్ ఆరోపించారు. ఈ ఘటనపై రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.