Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరం.. బాలికపై యువకుడి అత్యాచారం.. పరారీలో నిందితుడు
Konaseema Crime : కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు బాలిక కేకలకు అక్కడికి వెళ్లారు. దీంతో బాలికను అత్యాచారం చేసిన నిందితుడు పరారయ్యాడు. అటు శ్రీకాకుళం జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.
కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. బాలిక (17)పై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలిక నానమ్మ సంరక్షణలో ఉంటోంది. ఆ బాలిక ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈ బాలికపై స్థానికంగా ఉండే ములపర్తి వినయ్ కన్నేశాడు. ఆమెను ఎలాగైన లోబర్చుకోవాలని ప్రయత్నించాడు.
బాలిక నాన్నమ్మ ఇంటి వద్దే ఉండటంతో వీలు కాలేదు. ఈ నేపథ్యంలో బాలిక నాన్నమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల వైద్యానికి వేరే గ్రామంలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లింది. దీంతో ఇదే అదునుగా ఆమెను లోబర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ములపర్తి వినయ్ శుక్రవారం రాత్రి సమయంలో ఇంట్లోకి దూరి అత్యాచారం చేశాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా వదలేదు.
దీంతో ఆ బాలిక భయంతో కేకలు వేసింది. స్థానికులు కేకలను గమనించి అక్కడకు చేరుకున్నారు. నిందితుడు వినయ్ పరార్ అయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు వినయ్ జులాయిగా తిరుగుతాడని తెలిపారు.
బాలికపై అన్నయ్య లైంగిక దాడి..
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యువకుడు బాలికకు వరుసకు అన్నయ్య అవుతాడు. పాతపట్నం సీఐ వానపల్లి రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక బుధవారం సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు దారిలో అడ్డగించాడు. తెలిసిన వాడే అని బాలిక ఆగడంతో తన చెడుబుద్ధి చూపించడానికి ప్రయత్నించాడు.
దీంతో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. ఇంతలోనే తోటి విద్యార్థులు వెనుక నుంచి రావడంతో అతడు పారిపోయాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు యువకుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. ఈ గొడవ పెద్ద మనుషుల వద్దకు వెళ్లింది. పెద్ద మనుషుల సమక్షంలో న్యాయం జరిపించాలని కోరారు. న్యాయం జరగకపోవంతో శనివారం మెళియాపుట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడిని పాతపట్నం సీఐ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)