East Godavari : అప్పు తీర్చమన్నందుకు తండ్రి, కుమార్తెలపై దాడి.. తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు
East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమని అడిగినందుకు తండ్రి, కుమార్తెపై ఒక వ్యక్తి దాడి చేశాడు. తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసేందుకు వచ్చారని, ఆత్మ రక్షణ కోసమే ప్రతిఘటించానని నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విజయవాడ కుంచరపల్లికి చెందిన కాజా కావ్యశ్రీ అనే యువతి ఈవెంట్స్‌కు యాంకర్‌గా చేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఆమెకు రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ స్థానిక కార్యకర్త నల్లూరి వెంకట శ్రీనివాస్ కుమారుడు ఎన్. అభిలాష్‌తో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు చేసుకున్నంత స్నేహం వారి మధ్య ఏర్పడింది.
ఈ క్రమంలో 2021లో అభిలాష్ తాను చేసే వ్యాపారానికి రూ. 3 లక్షలు అప్పుగా కావాలని కావ్యశ్రీని అడిగాడు. ఆమె కూడా స్నేహితుడికి రుణ సహాయం చేయడానికి వెనకడుగు వేయలేదు. అప్పటి నుంచి ఆ నగదకు వడ్డీ కూడా ఇవ్వకపోవగా, అసలు గురించీ కూడా అభిలాష్ మాట్లాడం మానేశాడు. ఈ విషయాన్ని అభిలాష్ తండ్రి శ్రీనివాస్ వద్దకు వచ్చి ఆ యువత పలుమార్లు చెప్పారు.
ఏళ్లు గడుస్తున్నా సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. అలాగే తండ్రీ కొడుకులు ఇద్దరూ కావ్యశ్రీ ఫోన్‌కు స్పందించటం లేదు. ఆదివారం కోనసీమ జిల్లా తాటిపాకలో ఓ ఈవెంట్‌కు యాంకరింగ్ చేశారు. అనంతరం హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఎలాగూ ఇంత దగ్గరికి వచ్చాము కదా, డబ్బులు అడిగి వెళ్దామని కావ్యశ్రీ నిర్ణయించుకుని రాజమహేంద్రవరంలో ఆగారు.
తన తండ్రి నాగరాజును కూడా రాజమహేంద్రవరం రమ్మని ఇద్దరు కలిసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అక్కడ అభిలాష్ లేకపోవడంతో తమ వద్ద తీసుకున్న నగదు ఇవ్వాలని శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో వాగ్వాదం జరిగింది. నగదు అడిగేందుకు ఇంటేకే వస్తారా? అని నాగరాజుపై శ్రీనివాస్ దాడి చేశాడు. కావ్యశ్రీ అడ్డుకోవడానికి వెళ్లగా ఆమెపై కూడా చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో తండ్రి, కుతురు నాగరాజు, కావ్యశ్రీ ఇద్దరూ గాయపడ్డారు.
అయితే.. దాడి చేసిన శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఇంటిపైకి వచ్చారని, తనపై దాడికి పూనుకున్నారని, ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించానని పోలీసులకు బాధితులపైన ఫిర్యాదు చేశాడు. సీఐ బాజీలాల్ ఆ ఫిర్యాదును నమోదు చేయకుండా హోల్డ్‌లో పెట్టారు. ఆ తరువాత బాధితులు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ బాజీలాల్ వారికి కానిస్టేబుల్‌ను ఇచ్చి ఆసుపత్రికి పంపించారు. ప్రాథమిక చికిత్స చేసిన తరువాత, ఎంఎల్‌సీ నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)