Warangal : ఓనర్ ఒంటిపై బంగారం దోచుకునేందుకు దారి దోపిడీ నాటకం.. ముగ్గురు అరెస్టు
Warangal : నమ్మకంగా ఉంటున్నాడని డ్రైవర్ పని ఇచ్చిన యజమానికే ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టాడు. పక్కా పథకంతో తన స్నేహితులతో ఓనర్ పై దాడి చేయించి బంగారం దోపిడీ చేయించాడు. ఈ నాటకంలో దారి దోపిడీకి వచ్చిన నిందితులు డ్రైవర్ పైనా దాడి చేసి పరారయ్యారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

హనుమకొండ ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బైరి రాము అనే యువకుడు కారు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. అతనికి సుబేదారికి చెందిన కీర్తి రవీందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. రవీందర్ తన కారు డ్రైవర్‌గా పని చేసేందుకు రామును మాట్లాడుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. డ్రైవర్‌గా చేరిన రాము తన యజమాని ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేశాడు. ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నాడు.
దారి దోపిడీకి స్కెచ్..
ఓనర్ ఒంటిపై ఉన్న బంగారం చోరీ చేసేందుకు నిర్ణయించుకున్న డ్రైవర్ రాము.. తన ఆలోచనను స్నేహితులైన నర్సంపేట మండలం రాజుపేటకు చెందిన రావుల ఆరుణ్ కుమార్, నల్లబెల్లి మండలంలోని మేడిపల్లికి చెందిన ఒర్సు గణేష్ అనే యువకులకు చెప్పాడు. వారంతా కలిసి రాము చెప్పినట్టుగా కారు ఓనర్ కీర్తి రవీందర్ బంగారాన్ని చోరీ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. తమ ప్లాన్‌లో భాగంగా ఈ నెల 13న రాత్రి సమయంలో అరుణ్ కుమార్, గణేష్ ఇద్దరూ రాము, రవీందర్ ప్రయాణిస్తున్న కారును వెంబడించారు.
హనుమకొండలోని న్యూ శాయంపేట చెరువు కట్ట మీదుగా వెళ్తున్న కారును ఆపి, ఓనర్ రవీందర్‌పై దాడికి దిగారు. తమ నాటకంలో భాగంగా ఆ పక్కనే ఉన్న డ్రైవర్ రాముపై కూడా దాడి చేశారు. అనంతరం రవీందర్ ఒంటిపై ఉన్న 31 గ్రాముల బంగారం తోపాటు రాము చేతికి ఉన్న రోల్డ్ గోల్డ్ ఉంగరాన్ని దోచుకుని పరారయ్యారు. బాధితుడు రవీందర్ డ్రైవర్ రాముతో కలిసి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
డ్రైవర్ కదలికలపై అనుమానం కలగడం, సెల్ ఫోన్ డేటా, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా రామును అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారణ జరిపారు. దీంతో డ్రైవర్ రాము అసలు జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా సుబేదారి పోలీసులు అరుణ్ కుమార్ తో పాటు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.లక్షన్నర నగదు, బంగారం, రోల్డ్ గోల్డ్ ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఛేదించిన సిబ్బందిని ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి, ఉమ్మడి వరంగల్ జిల్లా)