AP Law Student Incident : విశాఖలో షాకింగ్ ఘటన, లా విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారం-వీడియోలు తీసి పదే పదే
AP Law Student Incident : ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. లా విద్యార్థినిపై తోటి విద్యార్థితో పాటు మరో ముగ్గురు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం వీడియోలు సెల్ ఫోన్ లో రికార్డు చేసి పదే పదే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏపీలో ఆడపిల్లల ఘోరాలు ఆగడంలేదు. నిత్యం ఏదోకచోట మృగాళ్లు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా విశాఖలో మరో దారుణం వెలుగుచూసింది. లా విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆ వీడియోలను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని పలుమార్లు లా విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
అసలేం జరిగింది?
బాధితురాలి విశాఖ మధురవాడలోని ఓ లా కాలేజీలో లా మూడో సంవత్సరం చేస్తుంది. విద్యార్థిని తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ, ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ విద్యార్థినిపై వంశీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థినిని ఆగస్టు 13న డాబాగార్డెన్ లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లిన వంశీ..మరోమారు అత్యాచారం చేశాడు. అనంతరం వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. యువతి నగ్నంగా ఉన్న వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ యువతికి ఫోన్ చేసి తమ కోరిక తీర్చాలని లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని యువతి వంశీ దృష్టికి తీసుకెళ్లగా...తన స్నేహితుల కోరిక తీర్చాలని ఆమె వేధించాడు. నలుగురి నుంచి రోజురోజుకీ వేధింపులు పెరగడంతో ఈ నెల 18న ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు. యువతిని గమనించిన ఆమె తండ్రి కాపాడి అసలేం జరిగిందని నిలదీయడంతో నిర్ఘాంతపోయే విషయాలు యువతి తండ్రికి చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
స్పందించిన హోంమంత్రి
విశాఖ లా విద్యార్థిని సామూహిత అత్యాచార ఘటన సంచలనం అవుతోంది. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ సీపీతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు.
చిన్నారిపై పదో తరగతి విద్యా్ర్థి లైంగిక దాడి
చిన్నారిపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. నాలుగుప్పలపాడు మండలంలోని ఒక గ్రామానికి చెందిన చిన్నారి రెండో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఆ బాలిక ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి చిన్నారి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆమె వద్దని ఎంత వారించిన వినకుండా నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ చిన్నారి వెక్కివెక్కి ఏడ్చింది. నొప్పితో బాధపడుతూ విలపించింది. తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరకున్నారు. అప్పటికి చిన్నారి మొహంలో కలతను గ్రహించిన వారు ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు చిన్నారి జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఎస్ఐ శ్రీకాంత్.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.