Maharashtra CM: మహారాష్ట్ర సీఎం పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్; ఏక్ నాథ్ షిండేకు కోపం వచ్చిందా?-suspense over maha cm shinde cancels appointments heads to native village ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Cm: మహారాష్ట్ర సీఎం పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్; ఏక్ నాథ్ షిండేకు కోపం వచ్చిందా?

Maharashtra CM: మహారాష్ట్ర సీఎం పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్; ఏక్ నాథ్ షిండేకు కోపం వచ్చిందా?

Sudarshan V HT Telugu
Nov 29, 2024 03:57 PM IST

Maharashtra CM: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరవుతారన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయం శుక్రవారం తేలుతుందన్న వార్తలకు చెక్ పెడుతూ.. శివసేన నేత ఏక్ నాథ్ షిండే అన్ని మీటింగ్స్ రద్దు చేసుకుని సొంతూరికి వెళ్లిపోయారు.

ఏక్ నాథ్ షిండేకు కోపం వచ్చిందా?
ఏక్ నాథ్ షిండేకు కోపం వచ్చిందా? (ANI)

Maharashtra CM: మహారాష్ట్రలో మహాయుతి కూటమి సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శుక్రవారం తన అన్ని అపాయింట్ మెంట్లను రద్దు చేసుకుని సొంతూరుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని శివసేన అధికార ప్రతినిధి మనీషా కయాండే ధృవీకరించారు. ఏక్ నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ లో తేలలేదా?

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలోని మూడు రాజకీయ పార్టీల నాయకులు.. శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లి వచ్చిన మర్నాడే షిండే అన్ని మీటింగ్స్ ను రద్దు చేసుకుని సొంతూరుకు వెళ్లడం గమనార్హం. ఢిల్లీలో వీరు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో చర్చలు జరిపారు. వచ్చే వారం ప్రారంభంలో ప్రమాణ స్వీకారం చేయబోయే కూటమిలోని మూడు పార్టీలకు ఇవ్వాల్సిన కేబినెట్ బెర్త్ లపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

సీఎం పదవి బీజేపీకే..

ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. బీజేపీకి ముఖ్యమంత్రి పదవి దక్కనుండగా, మహాయుతి కూటమిలోని శివసేన, ఎన్సీపీ (ఏపీ) లకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయి. ఈ ప్రతిపాదనకు అమిత్ షా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.ఒక్కో మిత్రపక్షం శివసేన, ఎన్సీపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున డెప్యూటీ సీఎంగా ఉంటారని అమిత్ షా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికి తుది పేరును తర్వాత జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని షిండే స్పష్టం చేశారు. ‘‘సమావేశం చాలా బాగా జరిగింది. సానుకూలంగా సాగింది. ఇది మొదటి సమావేశం. అమిత్ షా (amith shah), జేపీ నడ్డాతో చర్చించాం. మరోమారు మహాకూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆ సమావేశం ముంబైలో జరుగుతుంది’’ అని సమావేశం అనంతరం ఏక్ నాథ్ షిండే విలేకరులకు తెలిపారు.

నవంబర్ 23 నుంచి..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23 న వెలువడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ, నాటి నుంచి కూడా కూటమి నేతలు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఒక ఏకాభిప్రాయానికి రావడం లేదు. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షాలైన ఏక్ నాథ్ షిండే (eknath shinde) నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వరుసగా 57, 41 స్థానాల్లో విజయం సాధించాయి.

Whats_app_banner