Sukhbir Singh Badal: స్వర్ణ దేవాలయం వద్ద శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు
Sukhbir Singh Badal: పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కాల్చిచంపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కానీ, ఆ వ్యక్తిని అడ్డుకున్న బాదల్ అనుచరులు, అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.
Sukhbir Singh Badal: శిరోమణి అకాలీదళ్ (SAD) పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పై అమృత సర్ లోని స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో దాడి జరిగింది. బాదల్ ను తుపాకీతో కాల్చి చంపేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ విధించిన మతపరమైన శిక్షల కింద సుఖ్బీర్ సింగ్ బాదల్ సహా శిరోమణి అకాలీదళ్ (SAD) నాయకులు గోల్డెన్ టెంపుల్ లో బుధవారం ఉదయం 'సేవ' చేస్తున్న సమయంలో ఈ కాల్పుల ఘటన జరిగింది.
పోలీసుల అదుపులో నిందితుడు
అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వెలుపల ఎస్ ఏడీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కాల్చడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని నరైన్ సింగ్ చౌరా అనే మాజీ మిలిటెంట్ గా గుర్తించారు. అతడిపై పలు కేసులు ఉన్నాయని, ఇన్నాళ్లు అతడు అజ్ఞాతంలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో నారాయణ్ సింగ్ చౌరా సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు దగ్గరగా వస్తూ, అకస్మాత్తుగా జేబులో నుంచి తుపాకీ తీసి బాదల్ పై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అయితే, బాదల్ పక్కనే ఉన్న అనుచరులు వెంటనే స్పందించి బాదల్ కు బుల్లెట్స్ తగలకుండా కాపాడారు. మరికొందరు నారయణ్ సింగ్ ను అడ్డుకుని, బంధించారు.
సుఖ్బీర్ బాదల్ మతపరమైన శిక్ష
సుఖ్బీర్ సింగ్ బాదల్ స్వర్ణ దేవాలయంలో సిక్కు మతాధికారులు విధించే 'టంఖా' (మతపరమైన శిక్ష) కింద 'సేవదార్' లేదా వాలంటీర్ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి గోల్డెన్ టెంపుల్ వద్ద ఉన్నారు. ఒక చేతిలో ఈటె పట్టుకొని, నీలిరంగు 'సేవాదార్' యూనిఫాం ధరించిన సుఖ్బీర్ సింగ్ బాదల్ మంగళవారం తన వీల్ చైర్ లో స్వర్ణదేవాలయ ప్రవేశ ద్వారం వద్ద శిక్ష అనుభవిస్తున్నారు. అకాలీ నేత సుఖ్ దేవ్ సింగ్ ధిండ్సా వయసు రీత్యా వీల్ చైర్ లో ఉండగా, పంజాబ్ మాజీ మంత్రులు బిక్రమ్ సింగ్ మజితియా, దల్జీత్ సింగ్ చీమా శిక్షలో భాగంగా పాత్రలు కడిగారు. బాదల్, ధిండ్సాల తప్పులను అంగీకరిస్తూ వారి మెడలో చిన్న చిన్న బోర్డులు వేలాడదీశారు. ఇరువురు నేతలు గంటపాటు 'సేవకులు'గా సేవలందించారు.
ప్రభుత్వ తప్పులకు..
2007 నుంచి 2017 వరకు పంజాబ్ (punjab) లోని శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం చేసిన తప్పులకు బాదల్, ఇతర నాయకులకు 'టంఖా' (మతపరమైన శిక్ష) విధించిన అకాల్ తఖ్త్ లోని సిక్కు మతాధికారులు సోమవారం సీనియర్ అకాలీ నాయకుడిని 'సేవదార్'గా పనిచేయాలని, స్వర్ణ దేవాలయంలో గిన్నెలు కడగాలని, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించారు.