Bhagwant Singh Mann: పంజాబ్ సీఎం కు ప్రమాదకరమైన ‘లెప్టోస్పైరోసిస్’ వ్యాధి; కొనసాగుతున్న చికిత్స-bhagwant singh mann diagnosed with leptospirosis what is this disease ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bhagwant Singh Mann: పంజాబ్ సీఎం కు ప్రమాదకరమైన ‘లెప్టోస్పైరోసిస్’ వ్యాధి; కొనసాగుతున్న చికిత్స

Bhagwant Singh Mann: పంజాబ్ సీఎం కు ప్రమాదకరమైన ‘లెప్టోస్పైరోసిస్’ వ్యాధి; కొనసాగుతున్న చికిత్స

Sudarshan V HT Telugu
Sep 29, 2024 03:51 PM IST

Bhagwant Singh Mann: పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రమాదకరమైన ‘లెప్టోస్పైరోసిస్’ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఈ ప్రాణాంతక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు చికిత్స పొందుతున్నారు.

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ (HT_PRINT)

Bhagwant Singh Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రొటీన్ చెకప్ కోసం బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు, వైద్య పరీక్షలు నిర్వహించగా, లెప్టోస్పిరోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది.

కోలుకుంటున్న సీఎం..

లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు యాంటీబయాటిక్స్ తో చికిత్స ప్రారంభించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన గణనీయంగా కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఫోర్టిస్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్కే జస్వాల్ తెలిపారు. కాగా, పంజాబ్ (punjab) ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకడంపై రాష్ట్రంలోని విపక్ష నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ ఒక సీఎం తన ఆరోగ్యం తాను చూసుకోలేకపోతే, పంజాబ్ ను ఎలా చూసుకుంటారని ప్రశ్నించారు.

లెప్టోస్పిరోసిస్ అంటే ఏమిటి?

లెప్టోస్పిరోసిస్ అనేది ప్రాథమికంగా ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది కలుషితమైన నీరు, మట్టి, మూత్రం లేదా ఇతర శారీరక ద్రవాల ద్వారా మానవులు, జంతువులలో వ్యాపిస్తుంది. లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి వలన మూత్రపిండాలు దెబ్బతినడం, మెనింజైటిస్, కాలేయ వైఫల్యం, శ్వాసకోశ సమస్య మొదలైన అనారోగ్యాలు తలెత్తుతాయి. సరైన చికిత్స లభించకపోతే మరణానికి కూడా కారణమవుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ప్రతి సంవత్సరం సుమారు 1 మిలియన్ లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదవుతాయని, వాటిలో 60,000 మరణాలు సంభవిస్తాయని తెలిపింది.

లెప్టోస్పిరోసిస్ లక్షణాలు

లెప్టోస్పిరోసిస్ సోకిన వారిలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. బ్యాక్టీరియా సోకిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనిపించడానికి 2-30 రోజులు పడుతుంది. ఈ వ్యాధి తరచుగా రెండు దశలలో సంభవిస్తుంది. మొదటి దశలో జ్వరం, చలి, తలనొప్పి, విరేచనాలు, వికారం ఉంటాయి. రెండో దశలో మూత్రపిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం లేదా మెనింజైటిస్ తో తీవ్రత పెరుగుతుంది. సరైన చికిత్స చేయకపోతే ఈ అనారోగ్యం కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు ఉంటుంది.

గమనించాల్సిన ఇతర లక్షణాలు:

  • కామెర్లు
  • ఎర్రటి కళ్ళు
  • కడుపు నొప్పి
  • రష్
  • కండరాల నొప్పులు

చికిత్స

లెప్టోస్పిరోసిస్ ను డాక్సీసైక్లిన్ లేదా పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయవచ్చు. ఈ వ్యాధి విషయంలో, శరీరంలో మరింత తీవ్రమైన లక్షణాలు కనిపించకుండా నిరోధించడానికి ప్రారంభ చికిత్స కీలకం. తరచుగా చేతులు కడుక్కోవడం, మీ చుట్టూ ఉన్న జంతువులకు టీకాలు వేయడం, కలుషితమైన నీరు ఉన్న ప్రాంతాలను నివారించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదలు లేదా తుఫానుల తర్వాత కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా ఎక్కువ కాలం జీవించగలదు. కాబట్టి లెప్టోస్పైరోసిస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.