Nepal floods: నేపాల్ అంతటా భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 66 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి దిల్ కుమార్ తమాంగ్ తెలిపారు.
మరణించిన 66 మందిలో 34 మంది ఖాట్మండు లోయలోనే మరణించారని నేపాల్ పోలీసు డిప్యూటీ అధికార ప్రతినిధి బిష్వో అధికారి తెలిపారు. ఖట్మండూ లోయలో సుమారు 40 లక్షల మంది నివసిస్తున్నారు.
విరిగిపడ్తున్న కొండచరియల కారణంగా హిమాలయ దేశం నేపాల్ అంతటా 63 రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. హిమాలయ దేశంలోని చాలా నదులు ఉప్పొంగి రోడ్లు, వంతెనలపైకి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. నేపాల్ తాత్కాలిక ప్రధాని ప్రకాశ్ మాన్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించారు. హోం మంత్రి, హోం కార్యదర్శి, భద్రతా సంస్థల అధిపతులతో సహా పలువురు మంత్రులు ఈ అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు.
నేపాల్ వ్యాప్తంగా మూడు రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేయాలని, ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరీక్షలను (exams) నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరదల కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండులో ప్రధాన ట్రాన్స్ మిషన్ లైన్ కు అంతరాయం ఏర్పడటంతో శనివారం రోజంతా విద్యుత్ (electricity) సరఫరా నిలిచిపోగా, సాయంత్రానికి విద్యుత్ ను పునరుద్ధరించారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఖాట్మండుకు వచ్చే అన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఖాట్మండులో 226 ఇళ్లు నీట మునిగాయని, ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ పోలీసులకు చెందిన సుమారు 3,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన రెస్క్యూ టీంను మోహరించామని, ప్రజలను రక్షించడం, ప్రభావితమైన వారికి సహాయం చేయడమే ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యమని నేపాల్ హోం మంత్రి రమేష్ లేఖక్ తెలిపారు. హైవేలపై రాత్రివేళల్లో బస్సులు, కార్ల రాకపోకలను నిషేధించారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ (nepal) లో ఏటా వర్షాకాలంలో వందలాది మంది చనిపోతున్నారు.