Kerala Landslides : కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 84కి చేరిన మృతుల సంఖ్య-massive landslide hit keralas wayanad district death toll rise and hundreds missing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Landslides : కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 84కి చేరిన మృతుల సంఖ్య

Kerala Landslides : కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 84కి చేరిన మృతుల సంఖ్య

Anand Sai HT Telugu
Jul 30, 2024 04:02 PM IST

Kerala Landslide : కేరళలోని వాయనాడ్‌లో దారుణం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో 84 మంది మృతి చెందారు. వందలాది మంది శిథిలాల కిందే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వాయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు
వాయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు

కేరళలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. వాయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. టీ ఎస్టేట్ కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. 84 మంది మరణించారు. చాలా మంది కొండచరియాల్లోనే చిక్కుకున్నారు. వారిని బయటకు తీయడం కూడా కష్టంగా ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 84కు చేరినట్టుగా జిల్లా అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. వర్షం కారణంగా సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

yearly horoscope entry point

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. మలప్పురంలోని నిలంబూర్ ప్రాంతానికి ప్రవహించే చలియార్ నదిలో చాలా మంది కొట్టుకుపోతారని అనిపించిందని స్థానికులు భయంతో చెప్పారు. వాయనాడ్‌లోని మెప్పాడి పంచాయతీ పరిధిలోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి పెద్ద ప్రమాదం జరిగినట్టుగా వెల్లడించారు.

కోయంబత్తూరులోని సూలూరు నుంచి వాయనాడ్‌కు రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హెలికాప్టర్లు వెళ్లాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ రెండు బెటాలియన్లు కన్నూర్ నుండి వాయనాడ్‌కు తరలివెళ్లాయి. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ కు చెందిన రెండు బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. భారీ వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముండక్కై వద్ద అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు శిథిలాల కింద ఉన్నాయి. ఘటనాస్థలికి వెళ్లే వంతెన కొట్టుకుపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు గ్రామస్తులు ముందుకురాలేకపోయారు. టీ ఎస్టేట్‌ కార్మికుల కుటుంబాలు జీవిస్తున్న ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది.

వాయనాడ్ సహా కేరళలోని పలు ఉత్తర జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కేరళ ఎంపీలు రాజ్యసభలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. కేంద్రమంత్రులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇప్పటికే బాధితుల సహాయం కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ప్రారంభించింది. అత్యవసర సాయం కోసం 9656938689 , 8086010833హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చింది. దగ్గరలోని ప్రాంతాల్లో అన్ని ఆసుపత్రులు పూర్థిస్థాయిలో పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర సేవలు అందించేందుకు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి.

ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయని, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు వెళ్లారని చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది కలుగుతోంది.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.