TG School Closed : నెల రోజులుగా మూతపడిన గురుకుల పాఠశాల.. కారణం తెలిస్తే.. ముక్కున వేలేసుకుంటారు!
TG School Closed : ఖమ్మం జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వర్షాలు, వరదలు తగ్గాక అన్ని పాఠశాలలను రీ ఓపెన్ చేశారు. కానీ.. ఒక్క గురుకుల పాఠశాల మాత్రం ఇప్పటికీ మూతపడే ఉంది. అది కూడా మంత్రి ఇలాకాలో కావడం గమనార్హం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల నెల రోజులుగా మూతపడే ఉంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఏంటని.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలను.. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన మున్నేరు వరదలతో గురుకుల పాఠశాల బిల్డింగ్ మునిగిపోయింది. వర్షాలు, వరదలు తగ్గి నెలరోజులు కావొస్తున్నా.. ఆ గురుకుల పాఠశాల మాత్రం తిరిగి ప్రారంభానికి నోచుకోలేదు.
ఈ గురుకుల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదివేవారు. పాఠశాల ఇంకా తెరుచుకోక పోవడంతో.. విద్యార్థుల భవిష్యత్తు ఏంటోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో అసలు మంత్రులు ఉన్నారా..? పాలన నడుస్తుందా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాలేరు ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. అటు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సహా.. కేంద్ర మంత్రులు, కేంద్ర బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇటు ఖమ్మం నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. అనేక కాలనీలు రోజుల తరబడి నిటీలోనే నానాయి. ఖమ్మం ఆటోమొబైల్ రంగంపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి.
ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలో ఇంత జరుగుతున్నా.. మంత్రులు ఎక్కడ పోయారని ప్రజలు ప్రశ్నించారు. వరదల్లో 9 మంది చిక్కుకుంటే.. కనీసం హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వరదలు తగ్గి.. నెల రోజులు కావొస్తున్నా.. కనీసం పాఠశాలను కూడా పునః ప్రారంభించే చర్యలు కూడా తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.