PM SVANidhi Scheme : పీఎం స్వనిధి పథకం.. పేదలకు వరం.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
PM SVANidhi Scheme : కరోనా తర్వాత వీధి వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వారిని ఆదుకోవడానికి కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేసింది. వారికి రుణాలు ఇవ్వడానికి పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా రుణం పొందవచ్చు. ఈ పథకం అమలులో ఏపీ ముందంజలో ఉంది.
నిరుపేదలు వ్యాపారం కోసం రుణం పొందాలంటే.. రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాలి. ఆదాయ వనరులను చూపాలి. గుర్తింపు పత్రాలు, షూరిటీ ఇవ్వాలి. అయినా అప్పు వస్తుందనే గ్యారెంటీ లేదు. విచారణ, తనిఖీ అంటూ తిప్పుకుంటారు. ఏ ధృవపత్రం లేకున్నా, తనిఖీ సమయంలో ఇంట్లో లేకున్నా రుణం సంగతి మరవాల్సిందే. అప్పుడు వడ్డీ వ్యాపారులే దిక్కు.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కేంద్రం పీఎం స్వనిధి పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణం పొందవచ్చు. ఈ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం దూసుకెళ్తుంది. దీంతో మరిన్ని ప్రయోజనాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే నెలతో గడువు ముగస్తుండటంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత.. మెప్మా సిబ్బంది ఓ పత్రం ఇస్తారు. దానితో బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని బ్యాంకు అధికారులు పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. రూపాయి కంటే తక్కువ వడ్డీతో రుణం ఇస్తారు. తొలుత రూ.10 వేలు ఇస్తారు. 12 నెలల్లో దాన్ని పూర్తిగా చెల్లించాలి. సకాలంలో చెల్లిస్తే.. వడ్డీ డబ్బులను రుణం తీసుకున్నవారి ఖాతాలోనే వేస్తారు.
రూ.10 వేలు సరిగా చెల్లించన వారికి మళ్లీ రూ.20వేలు రుణం ఇస్తారు. 24 సులభ వాయిదా పద్ధతుల్లో వీటిని చెల్లించాలి. సకాలంలో రుణం చెల్లిస్తే.. మళ్లీ ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తారు. మూడోసారి రూ.50 వేల వరకు రుణం పొందవచ్చని మెప్మా అధికారులు సూచిస్తున్నారు. ఇది చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలామందికి పీఎం స్వనిధి పథకం కింద రుణాలు ఇచ్చారు.
ఈ పథకం కింద ఏపీలో ఇప్పటికే వేలాది మంది లబ్ధిపొందారు. ఇంకా ఎక్కువ మందికి లబ్దిచేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకే అన్ని మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మొత్తం 3.36 లక్షల మంది వీధి వ్యాపారులు ఉంటే.. వారిలో 2.90 లక్షల మంది వివరాలను అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. వీరికి కేవలం పీఎం స్వనిధి స్కీమ్ మాత్రమే కాకుండా.. మరో 8 కేంద్ర పథకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అటు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేజర్ మున్సిపాలిటీల్లో వెండర్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు పీఎం స్వనిధి స్కీమ్ గడువు పెంచాలని కేంద్రాన్ని కోరింది. రుణాలు అందించడంలో ముందున్న బ్యాంకర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చురుగ్గా పనిచేస్తున్న మెప్మా సిబ్బందిని సన్మానిస్తోంది.