TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళనలు, రైతులు రోడ్డెక్కితే గాని స్పందించని అధికారులు
TG Paddy Procurement : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. అన్నదాతల ఆందోళనతో అధికారులు ఆగమేఘాలపై కొనుగోలు ప్రారంభించి రైతులను సముదాయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నెల 5న ఆందోళనకు పిలుపునిచ్చారు.
అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం అమ్ముకోవడానికి కళ్లాల్లో పడిగాపులు కాయలేక ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డుపై ధాన్యం పోసి బైఠాయించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించే వరకు కదలమని భీష్మించారు. అన్నదాతల ఆందోళనతో స్పందించిన అధికారులు ఆగమేఘాలపై కొనుగోలు ప్రారంభించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేస్తూ 5న బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. దసరా పండుగ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు, పాలకులు దీపావళి పండుగ వరకు సైతం ధాన్యం కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కించారు. కొనుగోళ్లు జరగక, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక, అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోతుందని రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయం ముందు ధాన్యం పోసి బీఆర్ఎస్ నిరసన తెలుపగా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వద్ద రైతులు రోడ్డుపైనే ధాన్యం పోసి ఆందోళనకు దిగారు.
రోడ్డుపై బైఠాయించి ధాన్యం కొనుగోలు ప్రారంభించే వరకు కదలమని భీష్మించారు. ప్రభుత్వ తీరు అధికారుల వైఖరిని ఎండగడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా ఎందుకు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు స్థానిక రెవెన్యూ అధికారులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామి ఇచ్చి రెవెన్యూ, సివిల్ సప్లై, మార్కెటింగ్, రైస్ మిల్లర్లను పిలిపించి రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
కొనుగోళ్ల జాప్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళనకు బీజేపీకి పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4న అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు తహశిల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. అప్పటికి ప్రభుత్వం, అధికారులు స్పందించకుంటే నేరుగా తాను రైతుల పక్షాన ఆందోళన పాల్గొంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం బాధాకరమన్నారు బండి సంజయ్.
ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7572 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం వాటిలో ఇప్పటికే 4598 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు చెబుతుండగా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు వడ్లు తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
జాప్యం వెనుక కుట్ర
ధాన్యం రైతుల చేతికంది నెల రోజులు అవుతున్నా కొనుగోలు చేయకపోవడం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తెలుస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతులు విసిగిపోయి అడ్డికి పావుశేరుకు వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారనే ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇఛ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోసన్ ఇస్తామని హామీ ఇచ్చిన్పపటికీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని మెలిక పెట్టడం సమంజసం కాదన్నారు. అన్ని రకాల వడ్లకు కూడా బోనస్ చెల్లించి ఎన్నికల హామీని నెలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలని, అన్ని రకాల సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని లేనిచో రైతుల పక్షాన పోరాడక తప్పదని హెచ్చరించారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం