CM Revanth Reddy : తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు-cm revanth reddy serious on paddy procurement and water probelm issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy : తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 12, 2024 08:12 PM IST

CM Revanth On Paddy Procurement:ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ సీరియస్
సీఎం రేవంత్ సీరియస్ (CMO Telangana)

CM Revanthreddy On Paddy Procurement: ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని…. కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి,,, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని, ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలన్నారు.

ధాన్యం కొనుగోళ్ల(Paddy Procurement) ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలి. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలి. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల సమయం కావటంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ప్రచారం, ఉద్దేశ పూర్వక కథనాలపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాగునీటి ఇబ్బందులు రావొద్దు - సీఎం రేవంత్

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ పెరిగిన అవసరాలకు సరిపోవటం లేదని, భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాపై ఏ రోజుకారోజు సీఎస్… సారధ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.

“ హైదరాబాద్‌లో తాగు నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా, డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తరలించాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలి. ఇటు సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి” అని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్ లో ఇటీవల కొందరు సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన ఘటనపై సీఎం స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Whats_app_banner