Paddy Procurement: ఉమ్మడి కరీంనగర్‌లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. 1320 కేంద్రాలు ఏర్పాటు
Paddy Procurement: యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1320 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. April 1 నుంచి ఇప్పటివరకు వందకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
Paddy Procurement: యాసంగి పంటల వరి కోతలు ప్రారంభం కావడంతో చేతికి అందిన పంటను సకాలంలో రైతులు అమ్ముకునేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ది హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి ప్రారంభించారు.
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాల్ ధాన్యానికి 2203 రూపాయలు , సాధారణ రకం ధాన్యానికి 2183 రూపాయలని ధర నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
మద్దతు Minimum Support Price ధర కంటే తక్కువ రేటుకు ధాన్యం కొన్నా, కొనూగోళ్ళ సమయంలో రైతులను ఇబ్బంది పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, మధ్యలో దారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. రైతులు శ్రమ దోపిడికి గురి కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో హమాలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలని తెలిపారు. వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను వారికి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వరి ధాన్యానికి తేమ 17 శాతం వచ్చేలా చూసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
తాగునీటి సమస్యపై సమీక్ష
ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పలువురు అధికారులతో సమీక్షించారు.
వేసవికాలం నేపథ్యంలో తాగునీటికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందస్తుగా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
వ్యవసాయ భావులతోపాటు బోర్ వెల్స్, అవసరమైన ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పాత బావులను వాడవద్దని, అత్యవసరమైతే నీటిని పరీక్ష చేసిన తర్వాతే వాడుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా లో తలెత్తుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని, వాటిని సక్రమంగా సరఫరా చేసే విషయంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు
జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కర్ణన్ జిల్లాల్లో ఎక్కువ శాతం సిజేరియన్లు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణతో పాటు అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇష్టా రాజ్యాంగ అనుమతులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు బాగుంటేనే, ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ సరిగా ఉంటేనే అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. ప్రభుత్వ దవాఖనాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు వైద్యాధికారులు కష్టపడి పని చేయాలని సూచించారు. బాధ్యత రాహిత్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
ఎన్నికల విధులతో పాటు అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ శాఖల నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగం పై సమీక్ష నిర్వహించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫామ్ 12 డీ సమర్పించాలని సూచించారు. ఆయా శాఖల నోడల్ అధికారులు వాటిని అందించాలని పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించు కోవాలని తెలిపారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)
సంబంధిత కథనం