KRMB : తాగు నీటి ఎద్దడి వేళ KRMB కీలక నిర్ణయం - ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు, ఎవరికెంతంటే..?
KRMB On Water Allocation: తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన నీటి కొరతల నేపథ్యంలో కృష్ణా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసింది.
KRMB On Water Allocation: కృష్ణా బేసిన్ లో సరైన వర్షాలు ప్రాజెక్టుల్లో నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా ఈ బేసిన్ పై ఆధారపడి ఉండే ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఓవైపు ఎండల తీవ్రత మరింతగా ఉండటంతో… ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల లేకపోవటంతో…. పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాగు నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో… కృష్ణా బోర్డు(Krishna River Management Board) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసింది.
శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో కేఆర్ఎంబీ(Krishna River Management Board) ఛైర్మన్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. ఇందుకు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు కూడా హాజరయ్యారు. నీటి అవసరాలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న నీటి ఎద్దడి కారణంగా… నీటి కేటాయింపులు చేస్తూ కేఆర్ఎంబీ(KRMB) నిర్ణయం తీసుకుంది. సాగర్ ప్రాజెక్ట్ లో 500 అడుగులపైన ఉన్న 14 TMCల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందులో ఇందులో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించింది.
ఇక ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలకు తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరం కూడా తాగు నీటి ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని… ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు ఎక్కువ నీటి కేటాయింపులు చేయాలని కోరారు. గతంలో కృష్ణా జలాల్లో ఏపీ ఎక్కువ నీటిని తీసుకుందని గుర్తు చేశారు. శ్రీశైలం నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న కృష్ణా బోర్డు…. నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది.
నీటి కేటాయింపులపై మే మాసంలో మరోసారి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. ప్రస్తుతం వేసవిలో నీటి కొరత ఎక్కువగా ఉంది. ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి…. మేలో మరోసారి నీటి కేటాయింపులపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.