Maidaan Movie: మైదాన్ మూవీకి, హైదరాబాద్‌కు ఉన్న లింకేంటి? స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్
Maidaan Movie: బాలీవుడ్‌లో వచ్చిన మరో స్పోర్ట్స్ డ్రామా మైదాన్ సినిమాకు, మన హైదరాబాద్ కు ఓ లింకు ఉంది. ఈ అజయ్ దేవగన్ సినిమాకు తొలి రోజే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Maidaan Movie: భాషలకు అతీతంగా ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కాయి. అందులో కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ లో వచ్చిన మైదాన్ మూవీ కూడా అలాంటిదే. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇదొక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అంటూ అక్కడి సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా రూపొందిందే మన హైదరాబాదీ జీవితం ఆధారంగా అనే విషయం మీకు తెలుసా?
ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీం బయోపిక్
మైదాన్ మూవీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం అనే ఓ ఫుట్‌బాల్ కోచ్ బయోపిక్. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఈ రహీం పాత్రలోనే నటించాడు. ఇప్పుడంటే ఇండియన్ ఫుట్‌బాల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ కొన్ని దశాబ్దాల కిందట దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో మన టీమ్ ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫుట్‌బాల్ టీమ్స్ ను ఓడించిన విషయం ఎంతమందికి తెలుసు?
దానికి కారణం ఈ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం. అతడు పుట్టింది ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోనే. 1909లో జన్మించిన అబ్దుల్ రహీం.. మొదట్లో ఓ స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఫుట్‌బాల్ ప్లేయర్ గా ఎదిగారు. 1930ల్లో ఖమర్ క్లబ్, యురోపియన్ క్లబ్ హెచ్‌ఎస్వీ హొయెక్ లకు కొన్నాళ్లు ఆడారు. అయితే 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్, ఇండియన్ నేషనల్ టీమ్స్ కు కోచ్ అయిన తర్వాతగానీ అబ్దుల్ రహీం పేరు మారుమోగలేదు.
అతడు కోచ్ అయిన తర్వాత పదేళ్ల పాటు ఇండియన్ ఫుట్‌బాల్ కు ఓ గోల్డెన్ ఎరాగా చెబుతారు. కోచ్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టును మూడుసార్లు డ్యురాండ్ కప్ విజేతగా, ఐదుసార్లు రోవర్స్ కప్ విజేతగా నిలిపాడు. అయితే నేషనల్ జట్టుతో మరిన్ని అద్భుతాలు చేశాడు.
ఏషియా కింగ్ ఇండియా
రహీం కోచింగ్ లో ఇండియన్ టీమ్ ఏషియాలోనే బలమైన ఫుట్‌బాల్ జట్టుగా ఎదిగింది. 1951 ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచింది. తర్వాత 1956 ఒలింపిక్స్ లో ఏకంగా సెమీఫైనల్ చేరింది. అప్పటి వరకూ ఇండియన్ టీమ్ కు ఇదే బెస్ట్ రిజల్ట్. తర్వాత 1960 ఒలింపిక్స్ లోనూ పాల్గొంది. ఇక 1962 ఏషియన్ గేమ్స్ లో మరో గోల్డ్ మెడల్ తో రహీం కోచ్ గా తప్పుకున్నాడు.
రహీం బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా అతడు క్రియేట్ చేసిన టీమ్ 1964 ఏఎఫ్‌సీ ఏషియన్ కప్ లో సిల్వర్ గెలిచింది. రహీం కోచ్ గా ఉన్న సమయంలో ఇండియాను చాలా మంది యురోపియన్ కామెంటేటర్లు బ్రెజిల్ ఆఫ్ ఏషియాగా అభిర్ణించడం విశేషం. అయితే క్యాన్సర్ బారిన పడటంతో 1963లో కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
అదే ఏడాది జూన్ లో 53 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఇప్పుడీ లెజెండరీ కోచ్ జీవితం ఆధారంగానే అజయ్ దేవగన్ ఈ మైదాన్ సినిమాను తీశాడు. మూవీకి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియమణి కూడా నటించింది.