Jagan In TS Assembly:కేసీఆర్‌కు జగన్ థాంక్స్.. అసెంబ్లీలో వీడియో ప్రదర్శించిన ఉత్తమ్ కుమార్
Jagan In TS Assembly: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలయ్ బలయ్ అంటూ తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు జగన్ ధన్యవాదాలు తెలిపిన వీడియోలు అసెంబ్లీలో ప్రదర్శించారు.
Jagan In TS Assembly: ఏపీలో ఆయకట్టులో లేని ప్రాజెక్టులు నిర్మాణానికి కేసీఆర్ సహకారం ఉందని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కెఆర్‌ఎంబికి సాగునీటి ప్రాజెక్టుల్ని అప్పగించేది లేదని తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ జగన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు.
తెలంగాణ నుంచి నీరు వదిలితే తప్ప ఏపీకి నీరు వచ్చే పరిస్థితి లేదని, రాయల సీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరికి నీరు వచ్చే అవకాశం లేదని, కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసిన తన రాష్ట్రం నుంచి, తన బౌండరి నుంచి నీరు తీసుకోడానికి ఒప్పుకున్నారని జగన్ అసెంబ్లీ ప్రకటించారని వీడియోలో ప్రదర్శించారు.
కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సంబంధాల వల్లే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టుల్ని అప్పగించడానికి తాము సిద్ధం లేమని అసెంబ్లీ ప్రకటించారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత బిఆర్ఎస్ నాయకులు అక్కడకు వెళ్లాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 30న పోలింగ్ జరగడానికి ముందు ఒక్క రోజు 29 అర్థరాత్రి ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడి గట్టు గేట్లను బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి ఆ సమయంలో జగన్ అలా చేశారనే అనుమానం అందరికి ఉందన్నారు.
400-500 మంది బలగాలతో 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నారన్నారు. ఆ సమయంలో కేసీఆర్, జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసి జగన్ ఆంధ్రా పోలీసుల్ని సాగర్ మీదకు పంపారనే అనుమానాలు ఉన్నాయని ఉత్తమ్ ఆరోపించారు. సాగర్ గేట్లను స్వాధీనం చేసుకునే విషయంలో ఈ రోజుకు కేసీఆర్ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
డిసెంబర్ 1న కేంద ప్రభుత్వం జోక్యం చేసుకుని, తెలంగాణ రిజల్ట్స్ రాక ముందే సిఆర్‌పిఎఫ్‌ను పంపి ఏపీ పోలీసుల్ని అక్కడి నుంచి పంపారన్నారు. ఆ సమయంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో లేరన్నారు. డిసెంబర్1 నాటికి తెలంగాణలో కేసీఆర్ సిఎంగానే ఉన్నారని, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదన్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి తెలంగాణ సిఎంగా కేసీఆర్, ఆయన కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాతో పాటు, ఇరిగేషన్ అదనపు బాధ్యతలు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తరపున సెక్రటరీ స్మితా సబర్వాల్ డిసెంబర్ 1న రాసిన లేఖలో కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తు చేశారన్నారు.
15 జులై 2021న ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కేఆర్‌ఎంబికి ప్రాజెక్టుల్ని అప్పగించాయని స్మితా సబర్వాల్ గుర్తు చేశారన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ప్రాజెక్టుల్ని కెఆర్‌ఎంబికి అప్పగించారన్నారు.