AP Weather ALERT : బంగాళాఖాతంలో అల్పపీడనం...! 25,26 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచన
AP Telangana Weather Updates: ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం భూమధ్యరేఖ హిందూ మహా సముద్రం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ(నవంబర్ 23)బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
ఇవాళ, రేపు ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే నవంబర్ 25, 26 తేదీల్లో దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది.
ఈ ప్రభావంతో సోమవారం, మంగళ, బుధవాాారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. ఖరీఫ్ పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలకు నాలుగైదు రోజులు సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతాీవరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది. హెచ్చరికలు కూడా లేవని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ లో ఉదయం వేళలో పొగ మంచు ఎక్కువగా ఉంటుందని వివరించింది.