Medak Electrocution : మెదక్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు దుర్మరణం-medak four farmers died in four days due to electrocution traps for wild boar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Electrocution : మెదక్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు దుర్మరణం

Medak Electrocution : మెదక్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Oct 23, 2024 06:29 PM IST

Medak Electrocution : మెదక్ జిల్లాలో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు రైతుల ప్రాణాలు తీశాయి.

మెదక్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు దుర్మరణం
మెదక్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్ తో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు దుర్మరణం

అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు రైతులకు యమపాశాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లాలో నాలుగు రోజులలో నలుగురు రైతులు పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

యశ్వంతరావు పేటలో ఇద్దరు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావు పేట గ్రామానికి చెందిన రాసపల్లి కిషన్ (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలం వద్ద చేతికొచ్చిన పంటను అడవి పందులబెడద నుండి ఆ పంటను రక్షించుకోవడానికి ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేసి వాటికీ విద్యుత్ సరఫరా అయ్యే విధంగా వైర్లను బిగించాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన కిషన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెంది ఉన్నాడు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య స్వరూప, కొడుకు వంశీ ఉన్నారు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావు పేట గ్రామానికి చెందిన గుండెని యాదయ్య (45) శనివారం వరి పొలం వద్దకు అడవి పందుల కాపలకు వెళ్ళాడు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు వెళ్లి చూసేసరికి అక్కడ అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇందిరా, ఇద్దరు కుమారులు ప్రవీణ్, లింగం ఉన్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోతులబొగడ గ్రామంలో

పోతులబొగడ గ్రామానికి చెందిన రైతు శివశంకర్ (30) వ్యవసాయంతో పాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అడవి పందులు పంటను పాడు చేస్తుండడంతో వాటి నుంచి పంటను కాపాడుకోవటం కోసం పొలం చుట్టూ విద్యుత్ తీగతో కంచె ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే పంట కాపలా కోసం సోమవారం రాత్రి ఇంటి నుంచి చేనుకు వెళ్ళాడు. మంగళవారం ఉదయం ఇంటికి రాకపోవడంతో ఆటో నడపడానికి వెళ్లాడని కుటుంబసభ్యులు భావించారు. అయినా మంగళవారం సాయంత్రం వరకు శివశంకర్ ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పంట పొలం వద్దకు వెళ్లి చూడగా పంట రక్షణకు వేసిన విద్యుత్ తీగకు తగిలి విగత జీవిగా కనిపించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జాజి తండాలో మరొకరు

నర్సాపూర్ మండలం జాజి తండాకు చెందిన బుజ్జిబాయి(37) మంగళవారం ఉదయం మేకలను మేపడానికి అడవి వైపు తోలుకొని వెళ్ళింది. అక్కడ అదే తండాకు చెందిన శోభ అనే మహిళ తన వరి పంటను అడవి పందుల బెడద నుండి రక్షించుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగతో కంచె ఏర్పాటు చేసింది. అయితే బుజ్జిబాయికి చెందిన రెండు మేకలు పొలంలోకి వెళ్లాయి. అక్కడ కరెంట్ కంచెను గమనించకుండా బుజ్జిబాయి మేకలను తోలుకొనిరావడానికి పొలం వద్దకు వెళ్లడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు రెండు మేకలు కూడ మృతి చెందాయి.

ఈ విషయం గమనించిన తండావాసులు, బుజ్జిబాయి భర్త సేవ్యనాయక్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని ఆమె మృతికి కారణమైన వాళ్ళు వచ్చేదాకా మృతదేహాన్ని తరలించేది లేదని తండావాసులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని కుటుంబీకులకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner