Medak Accident: మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బీవీఆర్ ఐటీ కళాశాల బస్సులు ఎదురెదురుగా ఢీ.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Medak Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కళాశాలకు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక డ్రైవర్ తో సహా 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
Medak Accident: మెదక్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాలకు చెందిన రెండు బస్సులు ఉదయం విద్యార్థులను కళాశాలకు తీసుకొని రావడానికి వెళ్ళాయి. ఈ క్రమంలో ఒక బస్సు కళాశాల నుండి నర్సాపూర్ వైపు వెళ్తుండగా, మరోక బస్సు హైదరాబాద్ వైపు నుండి నర్సాపూర్ కు వస్తుంది. ఈ క్రమంలో రెండు బస్సులు నర్సాపూర్ ఆనంద్ గార్డెన్ సమీపంలోకి రాగానే ముందు ఉన్న ఆటోను తప్పించబోయి రెండు బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఒక బస్సు డ్రైవర్ నాగరాజు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక డ్రైవర్ యాదగిరి తో పాటు 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆ సమయంలో రెండు బస్సులలో కలిపి 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వెంటనే గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి, నర్సాపూర్, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నాగరాజును పటాన్చెరు వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న బస్సులను పక్కకు తీయించారు. ఈ ఘటనఫై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్‌లో మరో ఘటన ..
బంధువుల ఇంటికి వెళ్లి బైక్‌పై తిరిగొస్తుండగా, మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనం వీరి బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన కర్రోల్ల మల్లేశం (25), కొల్చారం మండలం కొంగోడ్ గ్రామానికి చెందిన మేకల ఎల్లం ఇద్దరు కలిసి బైక్ ఫై హవెలి ఘన్పూర్ మండలం పరిధాపూర్ గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లారు.
అనంతరం తిరిగి బైక్ ఫై వస్తుండగా పరిధాపూర్ గ్రామా శివారులో ఎదురుగా వస్తున్న వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందగా, ఎల్లంకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లం మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మల్లేశం కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.