Oil Palm Cultivation: అయిల్ పామ్ సాగుపై సందిగ్ధంలో రైతులు.. లాభదాయకం అంటున్న ప్రభుత్వం,త్వరలో నల్గొండలో ఆయిల్ ఫ్యాక్టరీ
Oil Palm Cultivation: దేశీయ వంట నూనెల అవసరాలు తీర్చడంలో పామాయిల్ ది సింహభాగం. ప్రతి ఏటా దేశానికి అవసరమైన వంట నూనెలో ఇండోనేషియా, మలేషియాల నుంచి 70 శాతం నూనెను దేశం దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం ఏటా రూ.1.20లక్షల కోట్లు విదేశాలకు చెల్లిస్తోంది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం తలపెట్టింది.
Oil Palm Cultivation: వంట నూనెల దిగుమతుల్ని తగ్గించుకోడానికి ఆయిల్ పాము సాగును ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తోంది. దీనిపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఉద్యాన వన శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా కనీసం ఒక కోటి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే కానీ దేశీయ వంట నూనెల అవసరాలు తీరవు.

కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేలం 7 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అంటే మరో 93 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశలో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 2.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. గడిచిన ఇరవై ఏళ్ల కిందటి నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ప్రాంతంలో సాగవుతుంది. రాష్ట్రంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట లో ఉన్నాయి. తెలంగాణలో మరో 14 ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లలో ఉంది.
పామాయిల్ సాగుపై రైతుల్లో సందిగ్ధం
ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలా..? చేస్తే లాభమా నష్టమా..? ప్రభుత్వం ఎంత వరకు ఆదుకుంటుంది అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. బుధవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులు పామాయిల్ సాగు చేస్తే లాభాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రతీ ఎకరా నుంచి కనీసం రూ.లక్షన్నర నుంచి రూ. రెండు లక్షల వరకు రాబడి ఉంటుందని ఆయన భరోసా కూడా ఇచ్చారు.
రాష్ట్రంలో 2022లో లక్ష ఎకరాల సాగు లక్ష్యానికి గాను, 89వేల ఎకరాల్లో పామాయిల్ సాగుచేశారు. 2023లో లక్ష ఎకరాల సాగు లక్ష్యానికి 1,03,000 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది (2024) 70వేల ఎకరాల్లో తోటలు సాగు చేయించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ధరల్లో వస్తున్న తేడాలతో పరిస్థితి అయోమంగా ఉందని, కొన్ని సార్లు ఖర్చులు కూడా వెళ్లడం లేదని ‘ పామాయిల్ రైతు జి.గోపాల క్రిష్ణ ’ హిందుస్థాన్ టైమ్స్ తో వ్యాఖ్యానించారు.
నిడమనూరు మండలం అన్నారం గ్రామ పరిధిలో ఆయన పదేళ్లుగా పామాయిల్ తోటలు సాగు చేస్తున్నారు. కాగా, నల్గొండ జిల్లాలో ఈ ఏడాది కి 10 వేల ఎకరాల విస్తీర్ణాన్ని ఆయిల్ ఫామ్ సాగు దాటేసింది.
పామాయిల్ కనీస మద్దతు ధర టన్నుకు రూ.10వేలు
ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పామాయిల్ కు మద్దతు ధర ప్రకటించింది. టన్ను పామాయిల్ కు రూ.10వేలు ఎంఎస్.పిగా నిర్ణయించింది. ఆయా ఫ్యాక్టరీలతో బై బ్యాక్ అగ్రిమెంట్స్ ఉన్నందున రైతులకు రూ.10వేలు అంతకంటే పైనే గిట్టుబాటు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ రేట్ టన్నుకు రూ.20వేలుగా ఉందని చెబుతున్నారు.
అంతే కాకుండా ప్రతీ 15 కిలోమీటర్ల పరిధిలో ఒక కలెక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, రైతులకు ట్రాన్స్ పోర్టు భారం కూడా పడదని చెబుతున్నారు. ప్రతీ ఎకరాకు కనీసం 50 నుంచి 57 మొక్కలు నాటుకోవచ్చని, 35ఏళ్ల తోట జీవిత కాలంలో 30 ఏళ్లు దిగుబడి తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. ‘‘ ఒక ఎకరా పామాయిల్ ద్వారా వచ్చే నూనె 9 ఎకరాల వేరుశనగ నుంచి వచ్చే నూనెకు సమానం.
అదే పొద్దుతిరుగుడు అయితే 12 ఎకరాలు, కుసుమ పంట అయితే 25 ఎకరాలు, నువ్వులు అయితే 37 ఎకరాలతో ఒక ఎకరా పామాయిల్ సమానం. ఎకరం తోట నుంచి నెలకు కనీసం ఒక టన్ను దిగుబడి కచ్చితంగా వస్తుంది. అంటే రూ. లక్ష రాబడి ఎక్కడికీ పోదూ. రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను 30 జిల్లాల్లో ఆయిల్ పామ్ మిషన్ నడుస్తోంది. రైతులు ఎలాంటి అనుమానం లేకుండా ఆయిల్ పామ్ తోటలు సాగు చేసుకోవచ్చు..’’ అని మునుగోడు హర్టీకల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ ‘ హిందుస్థాన్ టైమ్స్ ’ కు వివరించారు.
పదివేల ఎకరాల సాగు విస్తీర్ణం దాటేసినందున నల్గొండ జిల్లాలో పతంజని కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ ఫ్యాక్టరీ నెలకొల్పే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )