TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు.. దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి-telangana farmers demand purchase of paddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు.. దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి

TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు.. దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి

Basani Shiva Kumar HT Telugu
Nov 03, 2024 02:42 PM IST

TG Paddy Procurement : ఓవైపు వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా అన్నదాత అనాథ అవుతున్నాడు. పండించిన వడ్లను కొనుగోలు చేయాలని దీనంగా వేడుకుంటున్నాడు.

ధాన్యం ఆరబెడుతున్న రైతులు
ధాన్యం ఆరబెడుతున్న రైతులు

తెలంగాణలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నాయి. కానీ నేటికీ చాలాచోట్ల వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 7 వేల 572 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వాటిలో ఇప్పటికే 4 వేల 598 కొనుగోలు కేంద్రాలను కూడా తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభమే కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్ల కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. వడ్ల కుప్పలతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోయాయి. స్థలం లేక వడ్లను తీసుకొచ్చిన రైతులు రోడ్లపై రాశులుగా పోస్తున్నారు. దీంతో అటు రైతులకు, ఇటు వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడ్లు తడిసిపోయాయి. చాలా చోట్ల కోతకు వచ్చిన పంట వర్షాల వల్ల నీళ్ల పాలైంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వడ్లు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు కూడా తడిసిపోయాయి. ఎక్కడ చూసినా వడ్లు ఎండబెట్టుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు.

ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తయితే.. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విసిగిపోయి వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. 'ఎన్నికల్లో ఇఛ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోసన్ ఇస్తామని హామీ ఇచ్చిన్పపటికీ.. సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని మెలిక పెట్టడం సమంజసం కాదు. అన్ని రకాల వడ్లకు కూడా బోనస్ చెల్లించి ఎన్నికల హామీని నెలబెట్టుకోవాలని కోరుతున్నాం' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'మాకు అందిన సమాచారం మేరకు సన్న వడ్లకు బోనస్ అందించే విషయంలోనూ పరిమితి విధించినట్లు తెలిసింది. ఎకరాకు 30 క్వింటాళ్ల మేరకు సన్న వడ్లు పండినప్పటికీ.. అందులో కొంత మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని, అట్లాగే సన్న వడ్లను నిర్దారించేందుకు అనేక కొలతలను ప్రామాణికంగా చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు పంపినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పలువురు రైతులు తమవద్దకొచ్చి మొరపెట్టుకుంటున్నారు' అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

'వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పరిమితి లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేయాలి. అన్ని రకాల సన్న వడ్లకు బోనస్ చెల్లించాలి. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన అతి త్వరలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఎల్లుండి (05.11.2024) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కార్యాలయాలకు వెళ్లి తహసీల్దార్లకు బీజేపీ శ్రేణులు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నాము' అని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

Whats_app_banner