CM Chandrababu On Sand Policy : ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపు, అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu On Sand Policy : ఏపీలో ఇసుక లభ్యత పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో తరలిపోతుందని, దానిని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక విధానం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇసుక కొరతను తగ్గించేందుకు ఇటీవల సీనరేజి రద్దు చేసింది. తాజాగా ఇసుక లభ్యతపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుందని, దీనికి అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఇసుక లభ్యతను పెంచేందుకు సీనరేజి రద్దు చేసినట్లు సీఎం తెలిపారు.
రాష్ట్రం నుంచి ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో తరలిపోతుందని సమాచారం అందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేందుకు నూతన వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ఇప్పటి వరకు ఎడ్లబండ్లపై ఇసుక ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతివ్వగా... తాజాగా గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్లపై ఇసుక తరలింపునకు అనుమతిచ్చామన్నారు.
ట్రాక్టర్లపై ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగా వివరాలు నమోదు చేయించాలన్నారు. అలాగే ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ ను ప్రైవేటుకు అప్పగింతపై ఆలోచించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. మేరకు ఇసుక పాలసీలో సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఇసుక కొరత రావదన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు వాడుకునేలా ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. స్థానిక అవసరాలకు సరిపడిన మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైన వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీలో ఇసుక కొరత ఏర్పడింది. కొత్త ఇసుక తవ్వకాలు లేకపోవడంతో రీచ్ లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఇటీవల వర్షాలు, ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో నదుల్లో ఇసుక తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇసుక కొరతతో నిర్మాణ రంగం పనులు మందగించాయి. గ్రామాల్లో నిర్మాణ పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నాయి. దీంతో ఇసుక లభ్యత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్లేందుకు సీనరేజి రద్దు చేశారు.
సంబంధిత కథనం