PM E-Drive Scheme : పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ, ఎలా పొందాలంటే?-pm e drive scheme subsidy for electric vehicles guidelines eligibility how to claim ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm E-drive Scheme : పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ, ఎలా పొందాలంటే?

PM E-Drive Scheme : పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ, ఎలా పొందాలంటే?

Bandaru Satyaprasad HT Telugu
Updated Oct 26, 2024 01:34 PM IST

PM E-Drive Scheme : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ ను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం అమలుకు కేంద్రం రూ.10,900 కోట్ల నిధులు కేటాయించింది.

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ, ఎలా పొందాలంటే?
పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కేంద్రం సబ్సిడీ, ఎలా పొందాలంటే?

దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు పీఎం ఈ-డ్రైవ్(PM E-Drive scheme) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం మార్చి 31,2026 వరకు అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఈ-అంబులెన్సులు కొనుగోలుపై రాయితీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నొవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్' (PM E-DRIVE) పథకం అమలు కోసం రూ. 10,900 కోట్ల నిధులను సైతం కేటాయించింది.

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ లో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కమర్షియల్ ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల రిజిస్టర్డ్ ఈవీ వాహనాలు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. అధునాతన బ్యాటరీలు అమర్చిన ఈవీలకు మాత్రమే ఈ స్కీమ్ కింద రాయితీలు అందిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ టూవీలర్లకు బ్యాటరీ ఎనర్జీ ఆధారంగా కిలోవాట్ అవర్ కు రూ. 5,000 సబ్సిడీ ఇస్తారు. అంటే మొదటి ఏడాదిలో రూ. 10,000 లోపు సబ్సిడీ లభిస్తుంది.

రెండో ఏడాదిలో కిలోవాట్ అవర్ కు రూ. 2,500 చొప్పున రాయితీ ఇస్తారు. మొత్తం ప్రయోజనం రూ. 5,000 లోపు ఉంటుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు Ola, Ather Energy, TVS, Hero Vida, చేతక్ బజాజ్... 2.88-4 kWh బ్యాటరీ సామర్థ్యాలను బట్టి వాహనాలను రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయిస్తున్నాయి. ఈ పథకం కింద సబ్సిడీని పొందేందుకు ఇ-వోచర్‌లు అందిస్తామని, వాటి కోసం మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు తొలి ఏడాదిలో రూ. 25,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఈ-త్రీ వీలర్లకు రెండో ఏడాదిలో రూ. 12,500 సబ్సిడీ వస్తుంది. కార్గో త్రీవీలర్‌లకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుంది.

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ సబ్సిడీ పొందడం ఇలా?

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి ఉండాలి. ఒక ఆధార్ నంబర్ పై ఒక విద్యుత్ వాహనానికి మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ యాప్‌ను ప్రారంభించనుంది. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో కస్టమర్ ఆధార్‌ నంబరును పీఎం ఈ-డ్రైవ్ యాప్ ద్వారా ఫేస్ మొడాలిటీని ఉపయోగించి ఆథెంటికేట్ చేస్తారు. కస్టమర్‌కు సంబంధించిన ఫొటో గుర్తింపు కార్డు కాపీని డీలర్ కు అందించాలి. ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు వీటిల్లో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుగా అందించాలి. ఈ గుర్తింపు కార్డు కాపీని పీఎం ఈ-డ్రైవ్ యాప్‌లో డీలర్ అప్‌లోడ్ చేస్తారు.

కస్టమర్ మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీలను డీలర్‌కు ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తైన ద్వారా పీఎం ఈ-డ్రైవ్ యాప్ ద్వారా సబ్సిడీకి సంబంధించిన ఈ-ఓచర్ వస్తుంది. ఈ-ఓచర్ ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వినియోగదారుడి ఆధార్ నంబరుకు లింక్ అయిన మొబైల్ ఫోన్ నంబర్‌కు ఓ లింక్ వస్తుంది. ఈ లింక్ ద్వారా ఈ-ఓచర్ కలర్ ప్రింట్ తీసి దానిపై కస్టమర్ సంతకం చేసి డీలర్ కు ఇవ్వాలి. డీలర్ కూడా దానిపై సంతకం చేసి ఈ-ఓచర్ కాపీని కస్టమర్ కు ఇస్తారు. ఈ విధంగా ఈవీ వాహనంపై వినియోగదారుడికి సబ్సిడీ లభిస్తుంది. ఈ-ఓచర్ ను డీలర్ పీఎం ఈ-డ్రైవ్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. కస్టమర్ తో డీలరు ఒక సెల్ఫీ కూడా తీసుకుని ఈ-డ్రైవ్ యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ-ఓచర్లకు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.

Whats_app_banner